తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక సరికొత్త వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య సాగిన వైరానికి స్వస్తి పలికి.. రాబోయే రోజుల్లో రాజకీయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత చాణక్యంతో పావులు కదుపుతున్నారు. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ ఆధారంగా నడిచే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా సైడ్‌లైన్ చేసి, జాతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండేలా సీన్ క్రియేట్ చేయడం రేవంత్ డిజైన్ చేస్తున్న సరికొత్త పొలిటికల్ చిప్ తుది రూపానికి వస్తోంది.
కిషన్ రెడ్డి ద్వారా కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న రేవంత్
ఈ వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో తన విమర్శల రూట్‌ను పూర్తిగా మార్చేశారు. గతంలో కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా సాగిన ఆయన విమర్శలు.. ఇప్పుడు నేరుగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర నేత జి. కిషన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, ధాన్యం కొనుగోళ్ల వంటి అంశాలను తెరపైకి తెస్తూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించడం లేదని, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటించడం ద్వారా, రాష్ట్రంలో తానే తెలంగాణ హక్కుల ప్రధాన పోరాటయోధుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం రేవంత్ వ్యూహం.
అంతే ఘాటుగా ఎదురుదాడి చేస్తున్న కిషన్ రెడ్డి
ఈ పరిణామం రెండు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. రేవంత్ రెడ్డి విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే చౌకబారు రాజకీయాలు చేస్తోందని, ఒకే నెలలో కేంద్రం తెలంగాణకు రూ. 28,000 కోట్ల నిధులు ఇచ్చిందని చెబుతూ రేవంత్‌కు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. ఈ విధంగా నిత్యం కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్యే సవాళ్లు, ప్రతిసవాళ్లు నడిచేలా చేయడం ద్వారా.. ప్రజల మైండ్‌స్పేస్ నుంచి బీఆర్ఎస్ ఉనికిని క్రమంగా చెరిపేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. వార్తల్లో తాము, బీజేపీ మాత్రమే ఉంటే.. సహజంగానే ప్రతిపక్ష ఓటు బ్యాంకు చీలకుండా తమకే లాభిస్తుందనేది ఆయన లెక్క.
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీపై ప్రజాగ్రహం పెరుగుతుందని రేవంత్ అంచనా
రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యాంటీ-ఇంకంబెన్సీ పెరుగుతుందని, ఆ వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకోవాలంటే రాష్ట్రంలో బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా చూపించాలని రేవంత్ భావిస్తున్నారు. మధ్యలో బీఆర్ఎస్ ప్రస్తావన వస్తే విపక్ష ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అందుకే, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించినందున .. ఇకపై రేసులో బీఆర్ఎస్ లేదనే సంకేతాన్ని బలంగా పంపడం ద్వారా ద్విముఖ పోరులోనే స్వీప్ చేయాలనేది రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మార్కు రాజకీయాలకు అనుగుణంగా, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని బలహీనపరిచి బీజేపీతోనే నేరుగా ఢీకొట్టే ఈ పొలిటికల్ డిజైన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.


