భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే.. ఈ వారం ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్తపలుకు చదవాల్సిందేనని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఇంటి గుట్టు ఆయనకు బాగా తెలుసని.. కవిత ఎందుకు ఇలా రెబల్ గా మారారో ఆయన విపులంగా చర్చిస్తారని అనుకున్నారు. కానీ ఆర్కే అందర్నీ నిరాశ పరిచారు. రేవంత్ .. కేసీఆర్ నుంచి అపర చాణక్యుడనే బిరుదు ను కూడా లాగేసుకున్నారని పొగడటం తప్ప.. అసలు విషయం జోలికి వెళ్లలేదు. పైగా తనకు కూడా ఏమీ తెలియదన్నట్లుగా.. కవిత ఇలా ఎందుకు చేస్తున్నారో అని.. ప్రశ్నార్థకం ప్రయోగించారు. అందరూ చెబుతున్నట్లుగా.. పార్టీలో ప్రాధాన్యత, రాజకీయ భవిష్యత్ పై ఆందోళన అంటూ రాసుకొచ్చారు. కానీ కవిత రెబలిజం వెనుక అంత కన్నా బలమైన కారణం ఉందన్నది అందరి నమ్మకం . అదేంటో ఆర్కే కూడా చెప్పలేకపోయారు.
ఆ మధ్య బీఆర్ఎస్ పుంజుకుందని చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడకుండా రేవంత్ ప్రభుత్వ తీరుపై వరుసగా వ్యతిరేకంగా రాయడం ప్రారంభించారు. కానీ ఇలా రాసినా రెండు, మూడు నెలల్లోనే ఆర్కే తన వాయిస్ ను మార్చేసుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ పుంజుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు మళ్లీ పాతాళంలోకి పడిపోయిందని తేల్చారు. అంతర్గత సమస్యలకు తోడు.. రేవంత్ కూడా తీరు మార్చుకున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ .. చాణక్యుడిగా కనిపిస్తున్నారు ఆర్కేకు. అది చెప్పడానికే తన పలుకుల్లో అత్యధిక భాగం కేటాయించారు.
కాళేశ్వరం కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టేశారని ప్రశంసించారు. కేసీఆర్ జుట్టు బీజేపీ చేతికి ఇవ్వడం వల్ల… బీజేపీ చర్యలు తీసుకుంటే తన పంతం నెరవేరుతుంది… తీసుకోకపోతే వారిద్దరూ ఒకటే అని ప్రచారం చేయవచ్చు. కానీ అదే సమయంలో రేవంత్ కూడా తనను తాను గాయపర్చుకున్నారన్న విషయాన్ని చెప్పడానికి ఆర్కే సిద్దపడలేదు. కాంగ్రెస్ పాలసీలను ఆయన ధిక్కరించారు. సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది జాతీయ కాంగ్రెస్, రాహుల్ పాలసీలకు విరుద్ధం. కేంద్ర దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్ వాదనల్ని నిరుత్సాహ పరిచే విధానం. ఇది రేవంత్ పై కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకాన్ని తగ్గించే అంశం కూడా.
పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఫలితాలు సజావుగా వస్తున్నప్పుడు.. ఏ రాజకీయ నాయకుడినైనా చాణక్యుడు అంటారు. అదే చాణక్యుడు ఓడిపోతున్నప్పుడు మాత్రం కామన్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారని అంటారు. అంటే..చాణక్యుడు అనే లక్షణం.. గెలిచే రాజకీయ నేతల్లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ లక్షణం రేవంత్ లో ఉందని.. ఆర్కే మాట.
