ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. కాంగ్రెస్ పార్టీకి చల్లని కబురు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఆయన ఈ వారం కొత్త పలుకులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై అరిగిపోయిన విశ్లేషణ మళ్లీ చేసినప్పటికీ తాజా రాజకీయాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే.. రెండు నెలలతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పాజిటివిటీ పెరిగిందని తేల్చారు. చాలా వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సానుకూలతను తెచ్చి పెట్టాయని .. వచ్చి పడిన వ్యతిరేకతను తగ్గించాయని తేల్చేశారు.
ఆర్కే విశ్లేషణ ప్రకారం రెండు నెలల కిందటి వరకూ బీఆర్ఎస్ పుంజుకుంటున్నట్లుగా కనిపించింది. కానీ రేవంత్ రెడ్డి రైతు భరోసాను వేగంగా అమలు చేయడం , రేషన్ కార్డులు ఇవ్వడం, ఆ రేషన్ కార్డులకు సన్నబియ్యం పంపిణీ చేయడం పేదలను బాగా ఆకర్షించింది. ఇందిరమ్మ ఇళ్ల నిధులు కూడా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనూహ్యంగా సానుకూలత పెంచాయని ఆర్కే విశ్లేషణ. అదే సమయంలో బీఆర్ఎస్ అనుకూలత తగ్గిపోవడానికి కారణం కేటీఆర్ అని కూడా పరోక్షంగా చెప్పారు.
రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించడానికి కూడా ఇష్టపడని కేటీఆర్ ఆయనను దూషిస్తున్నారు. ఎలా దూషిస్తున్నారో కూడా ఆర్కే వివరించారు. రాజకీయకక్షలను వ్యక్తిగత కక్షలుగా మార్చుకున్న కేటీఆర్.. బీఆర్ఎస్ సానుకూలతను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడని చెప్పకనే చెప్పారు. ఉపఎన్నికలు వస్తాయా రావా.. వస్తే ఎవరు గెలుస్తారు అన్నది తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారబోతోందని చెబుతున్నారు. మిగతా ఉపఎన్నికల సంగతేమో కానీ జూబ్లిహిల్స్ ఉపఎన్నిక లో అసలు పరిస్థితి అర్థం అవుతుందంటున్నారు.
ఆర్కే విశ్లేషణ ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాలపై నడిచినా… రేవంత్ సర్కార్ కు తీపి కబురు చెప్పారు రేవంత్. ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతంగా వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఇప్పుడు ఆ వ్యతిరేకత కాస్తా అనుకూలతగా మారుతోందన్న అభిప్రాయం ప్రారంభమయ్యేలా ఆర్కే ఆర్టికల్ ఉంది. ఇది రేవంత్ కు సానుకూల సందేశమే పంపుతోంది.