ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో కేసీఆర్ కోసం పూర్తి స్థాయిలో తన అనుభవాన్ని రంగరించి మరీ పలుకులు వల్లే వేశారు. కేసీఆర్ ను ఏమీ చేయవద్దని రేవంత్ రెడ్డికి పదే పదే సలహా ఇచ్చారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోందని కూడా హెచ్చరించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అహంకారంతో చేసిన కక్ష సాధింపులు, ఓటుకు నోటు కేసు వల్లనే రేవంత్ కు క్రేజ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. అంటే ఓటుకు నోటు కేసు కూడా రేవంత్ కు ఉపయోగపడిందని .. అందుకే కేసీఆర్ ను ఏమీ చేయవద్దని తన పలుకుల ద్వారా ఆర్కే రేవంత్ కు సిఫారసు చేసినట్లుగా ఉంది.
కేసీఆర్ తప్పే చేశారని.. అయితే ఆ తప్పుల వల్ల రేవంత్ బాగుపడ్డారని ఆయన చెప్పదల్చుకున్నారు చెప్పారు. అదే సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలనే సలహాలు కూడా ఇచ్చారు. కాంగ్రెస్ లో రేవంత్ మినహా గొప్పగా మాట్లాడేవారు లేనందున కేసీఆర్, కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో ప్రభుత్వం పై విరుచుకుపడవచ్చని ఆయన సలహా ఇచ్చారు. ఆర్కేకు హఠాత్తుగా కేసీఆర్ పై ఇంత అభిమానం ఎందుకు వచ్చిందో కానీ … ఆర్టికల్లో వీలైనంత వరకూ రేవంత్ … ఆయన జోలికి వెళ్లకుండా ఉండేలా మనసు మార్చడానికి ప్రయత్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు విద్యుత్ ఒప్పందాలపై విచారణలు.. కాళేశ్వరంపై విచారణలు జరుగుతున్నాయి. ఇంకా పలు స్కాములు ఉన్నాయని వరుసగా బయటపెడతామని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ కోసం ఆర్కే వాదన వినిపించడం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం ఆర్కేని కూడా పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని సీఎం అయిన తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి సంస్థకు ప్రకటనలు కూడా ఇవ్వలేదు. టీవీ చానల్ ను బ్యాన్ కూడా చేశారు. అయినా ఫ్రెండ్ షిప్ కోసం… ఏమో కానీ.. కేసీఆర్ కోసం.. రంగంలోకి దిగిపోయారు.
ఇక ఏపీలో ప్రతిపక్ష , విపక్ష పార్టీలు ఒకరి ముఖం ఒకరు చూసుకోలేకపోయిన పరిస్థితి వచ్చిందని బాధపడ్డారు. అది వ్యక్తుల వల్ల చ్చిన సమస్య. అధికారం అందిన మత్తులో తన రాజకీయ ప్రత్యర్థులు అంటే.. వ్యక్తిగత శత్రువులే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్, జగన్ ల వల్లే ఆ పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఆర్కే ప్రస్తావించినప్పటికీ.. అందరూ అందరే అన్నట్లుగా జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్కే సలహాదారుని పాత్ర ఎక్కువగా పోషిస్తున్నారు. ఆ సలహాలన్నీ పలుకుల్లోనే బయటకు వస్తున్నాయి.