ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల ఎజెండాను ఖరారు చేశారు. ఏపీలో మత రాజకీయాల ప్రభావం పెరుగుతోందని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో అది ‘హిందూత్వం వర్సెస్ క్రైస్తవం’ అన్నట్లుగా మారబోతోందని ఆయన విశ్లేషించారు. ఈ వారం కొత్తపలుకులో జగన్ జాతకాన్ని మరింత పాతాళంలోకి తీసుకెళ్లే రెండు ప్రధాన అంశాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయని చెప్పారు. దానికి వైసీపీ కార్యాలయంలోనే చెప్పిన ఉగాది పంచాంగాన్ని ఆయన అన్వయించారు. కాస్త లోతుగా పరిశీలిస్తే, జగన్ భవితవ్యాన్ని ఈ రెండు అంశాలు తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయి.
వేమూరి రాధాకృష్ణ ప్రస్తావించిన మొదటి అంశం.. కుటుంబంలో ఆస్తుల గొడవలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్మును పంచడానికి జగన్ రెడ్డి నిరాకరిస్తున్నారని, ఇది కుటుంబంలో తీవ్ర కలహాలకు కారణమవుతోందని పేర్కొన్నారు. చివరికి తన తల్లి విజయమ్మ కూడా జగన్‌ను నమ్మకుండా ఒక లేఖను విడుదల చేసి, దానిని నోటరీ కూడా చేయించారు. నేరుగా చెప్పకపోయినా, జగన్ రెడ్డి వ్యక్తిత్వం ఏమిటో ఆయన తల్లి నోటరీ చేయించిన లేఖ ద్వారానే స్పష్టమైందని ఆర్కే అభిప్రాయపడ్డారు. ఈ ఆస్తుల గొడవ వచ్చే ఎన్నికల నాటికి మరింత ముదిరి, ప్రజల్లో జగన్ ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ప్రజలు అవినీతిని పెద్దగా పట్టించుకోకపోయినా, వ్యక్తిత్వాన్ని మాత్రం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారని ఆర్కే తేల్చి చెప్పారు.
ఆర్కే చెప్పిన రెండో అంశం.. మతం. జగన్ రెడ్డికి అత్యంత బలమైన ఓటు బ్యాంక్ అయిన దళిత క్రైస్తవులు కూడా దూరం కాబోతున్నారని ఆయన విశ్లేషించారు. దానికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు. “మతం మారిన వారు ఎస్సీ రిజర్వేషన్లు పొందలేరు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభావం జగన్ ఓటు బ్యాంక్‌పై తీవ్రంగా ఉంటుంది. పాస్టర్లు చర్చిల్లో ప్రచారం చేసి, మతం మారిన వారందరినీ వైసీపీకి ఓటు బ్యాంకుగా మార్చారు. ఇలాంటి పాస్టర్లలో అత్యధికులు దళితులే. వీరంతా ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటూ, ప్రభుత్వ రికార్డుల్లో క్రైస్తవులుగా నమోదయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం తలచుకుంటే వీరందరి ఎస్సీ సర్టిఫికేట్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఈ భయం వారిలో మొదలైంది. దీనివల్ల వారు ఇకపై బహిరంగంగా క్రైస్తవాన్ని ఆచరించడానికి లేదా జగన్ పార్టీ తరపున తిరగడానికి వెనకాడే అవకాశం ఉంది. అలా చేస్తే తమను క్రైస్తవులుగా నిర్ధారిస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. మెల్లగా ఈ ఓటు బ్యాంక్ జగన్‌కు దూరమయ్యే ప్రమాదం ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఇది ప్రధాన ఎజెండాగా మారుతుందని ఆర్కే జోస్యం చెప్పారు. జగన్ రెడ్డి తనను తాను క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారని, అయితే ఇప్పుడు తలెత్తిన ప్రమాదాన్ని పసిగట్టి ఆయన గుళ్లు, గోపురాలకు వెళ్తున్న ఫోటోలను వైరల్ చేయించుకుంటున్నారని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో హిందూ పండుగలు జరిపించడం, తన భార్యతో హిందూ సంప్రదాయాలు పాటించేలా చేయడం వంటివి కేవలం ప్రజలను నమ్మించడానికేనని ఆర్కే పేర్కొన్నారు. ఇలా ఇష్టం లేని పనులు చేయడం వల్ల జగన్ రెడ్డి మరింత పలుచన అవుతున్నారని చెప్పారు. మొత్తానికి జగన్ రెడ్డి తెచ్చిపెట్టుకున్న సమస్యలే ఆయనకు భస్మాసుర హస్తాలు గా మారుతున్నాయని, రాజకీయంగా ఆయన దెబ్బతినడం ఖాయమని ఆర్కే తనదైన శైలిలో సందేశాన్ని ఇచ్చారు.

