రెండేళ్ల కిందట కూటమికి గెలుపునకు కారణం ఎవరు?. లోకేష్ యువగళం పాదయాత్ర అని టీడీపీ నేతలు చెప్పుకుంటారు. కూటమికట్టడమే అని జనసేన నేతలు చెప్పుకుంటారు. మోదీ మ్యాజిక్ అని బీజేపీ నేతలు చెప్పుకుంటారు.అయితే ఇవేమీ కాదు.. అసలు కూటమిని గెలిపించింది జగన్ రెడ్డేనని అంటున్నారు ఆర్కే. జగన్ రెడ్డి వల్లనే కూటమికి బంపర్ మెజార్టీ వచ్చిందని ఇప్పుడు కూడా జగన్ రెడ్డి రప్పా..రప్పా.. , మావిగన్ లాంటి వింత ఆలోచనలు బయటపెడుతూంటే… చంద్రబాబు కన్నా అదృష్ట వంతుడు లేడని తేల్చేస్తున్నారు. ఈ వారం కొత్త పలుకులో జగన్ రెడ్డి ప్రవచించిన మావిగన్ రాజధానిపై ఆర్కే తనదైన విశ్లేషణ చేశారు.
అమరావతిపై ఈర్ష్యాద్వేషాలతో జగన్ రెడ్డి విచక్షణ కోల్పోతున్నారని .. కామెడీ పీస్ అవుతున్నారని కానీ ఆయనకు చెప్పేందుకు పార్టీ నేతలెవరూ సిద్ధంగా లేరని ఆర్కే అంటున్నారు. ఆయన చుట్టూ ఓ రకమైన పరదాలు కట్టారని బయట ఏం జరుగుతుందో తెలియకుండా.. అంతా బాగుందని నమ్మిస్తున్నారని చెబుతున్నారు. మూడేళ్లు కళ్లు మూసుకుంటే అధికారం చేతికి వస్తుందని జగన్ కు ఆయన చుట్టూ ఉన్న వాళ్లు చెబుతున్నారని అందుకే ఇలాంటి కామెడీ కథలు చెబుతున్నారని అంటున్నారు.
తాను ఎందుకు ఓడిపోయానో కనీసం విశ్లేషించకోకుండా తప్పు మీద తప్పులు చేస్తూ…. గతంలో జరిగిన తప్పుల్నే రిపీట్ చేస్తున్న జగన్ రెడ్డి రాజకీయాలు ఇలాగే కొనసాగితే.. చంద్రబాబు కంటే అదృష్టవంతుడు మరొకరు ఉండరని ఆర్కే చెప్పుకొచ్చారు. తాను ఏం చేసినా సమర్థించడానికి నిర్ధిష్టమైన ఓటు బ్యాంక్ ఉంటుందని జగన్ రెడ్డి అనుకుంటున్నారని కానీ ఇలాంటి నేతను సమర్థించాలనుకునేవారి సంఖ్య రాను రాను తగ్గిపోతుందని..అది జగన్ గుర్తించలేకపోతున్నారని ఆర్కే విశ్లేషణ.
అయితే ఆర్కే నుంచి ఇలాంటి రొటీన్ విశ్లేషణ రీడర్స్ ఆశించరు. అసలు మావిగన్ ఆలోచన ఎవరిది?. గతంలో మూడు రాజధానుల ఆలోచన ఎవరిది? తెర వెనుక ఏం జరిగింది?. సజ్జల .. సలహాదారును తాను కాదని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది?. ఇలాంటి ఇన్ సైడ్ న్యూస్ ను కోరుకుంటారు. అలాంటి మెరుపులు లేకుండా.. సాదాసీదాగా విశ్లేషణ పూర్తి చేశారు.

