ఎయిర్ పోర్టులోకి కోడి కత్తి వచ్చింది.. నట్టింట్లోకి వేట కత్తి వచ్చింది.. అమరావతిలో పచ్చటి అరటితోటలు తగలబడ్డాయి.. సంప్రదాయ రాజకీయాలు ఇష్టం లేని జగన్ ఇంకేదో చేయకుండా ఉండరు .. అని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఆందోళన చెందుతున్నారు. ఆయన ఏం చేస్తారో ఊహించలేకపోయారు కానీ ఏదో చేస్తారని మాత్రం కంగారు పడిపోయారు. ఈ వారం కొత్తపలుకు మొత్తం జగన్ రెడ్డి అమరావతిపై ఏదో కుట్ర చేస్తాడన్న భయాందోళనలతోనే సాగిపోయింది. ఆయన నేర మనస్థత్వం గురించి అమరాతి రాజధానిపై వ్యతిరేకత గురించి.. అంతకు మించి ఆయనకు ఉన్న కులద్వేషం గురించి బాగా తెలుసని.. ఆ ద్వేషాలతో సైకోలాగా మారి ఏదో చేస్తాడని అనుకుంటున్నారు. అదే సందేశాన్ని పంపించారు.
జగన్ రెడ్డి చేసే కుట్రల్ని ఎదుర్కొని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి సహకారం కూడా ఉంది కాబట్టి వచ్చే మూడేళ్లలో అమరావతి నిర్మాణం నిర్విఘ్నంగా జరుగుతుందని ఆర్కే తనకు తాను కాస్త ధైర్యం చెప్పుకున్నారు. జగన్ రెడ్డి చేసే రాజకీయాలపై కాకుండా..కుట్రలపైనే ఆర్కే రాతల్లో ఎక్కువగా ఆందోళన కనిపించింది. జగన్ రెడ్డి చేసే రాజకీయాల్లో కీలక పరిణామాలన్నీ యాధృచ్చికంగా జరిగిపోయినట్లుగా ఉంటాయి.. డాట్స్ కలుపుకుంటే.. ఓ పెద్ద క్రైమ్ ధ్రిల్లర్ స్టోరీ అవుతుందన్న అభిప్రాయాలు చాలా కాలంగా ఉన్నాయి. పరిటాల రవి హత్యకేసులో నిందితుల మరణాలు, వివేకా హత్యకేసులో గుండెపోటుగా ప్రచారం.. ఆ తర్వాత సాక్షుల మరణాలు.. ఆయన అక్రమాస్తుల కేసుల్ని ఆలస్యం చేసుకోవడానికి ఉపయోగించిన టెక్నిక్స్ ఇవన్నీ చూస్తే.. జగన్ రెడ్డిని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. ఆర్కేకు ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి ఆందోళనగా ఉన్నారు.
అయితే ఎప్పుడూ రాజకీయాలు ఒక్కలా ఉండవు. దానికి సాక్ష్యం.. ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే. జగన్ రెడ్డి పరిపాలనా తీరుపై ప్రజల్లో ఓ స్పష్టత వచ్చింది. బాబోయ్ జగన్ పాలన అని భయపడేలా ఆయన పరిపాలించారు. ఇప్పుడు ఆయన కుట్రలు ఫలించడం అంత తేలిక కాదు.. ఒక వేళ ఆయన కుట్రలు చేస్తే.. వాటిని నియంత్రించలేకపోతే అది ప్రభుత్వ పెద్దల చేతకానితనం అవుతుంది. అలాంటి చాన్స్ ఇవ్వకుండా.. అన్ని రకాలుగా ఆ కుట్రల ఆనుపానులు తెలుసుకుని నిర్వీర్యం చేయాలి. అయితే ఇలాంటి సలహాలు ఇవ్వడం కన్నా.. జగన్ ఏదో చేయబోతున్నాడని.. కంగారు పెట్టడానికే ఆర్కే పరిమితమయ్యారు.
ఏ రాష్ట్ర రాజదాని అయినా ఒక వర్గానిదో.. మతానిదో.. పార్టీదో కాదు. అది రాష్ట్ర ప్రజలందరిదీ. ఎవరైనా ఒక ప్రాంతానిదో.. ఓ వర్గానిదో అని నమ్మించగలిగారంటే.. అది పాలకుల లోపమే. దాన్ని తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇలా ఎలా చేయాలో…. ఆర్కే సలహాలివ్వాల్సింది. కానీ దానిపై ఆయన చాలా తక్కువ దృష్టి పెట్టారు. జగన్ గురించి భయపడటం.. భయపెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు.