జగన్ రెడ్డి పూజారి సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కడప అడవుల్లో ఆయన కుటుంబం కబ్జా చేసిన 55 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేసింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో సజ్జల కుటుంబానికి కొంత భూమి ఉంది. ఆ పక్కన అటవీ భూమి ఉండటంతో యథేచ్చగా ఆక్రమించుకుని ఫామ్ హౌస్ లా మార్చేసుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు.
సజ్జల కుటుంబం చేసిన అడవి కబ్జాపై ఆరోపణలు రావడంతో అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విచారణ చేయించారు. విచారణలో అసలు సజ్జల కుటుంబానికి అక్కడ అంత భూమి లేదని తేలింది. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లుగా సర్వేలో తేలింది. పూర్తి స్థాయిలో సర్వే చేసిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. యాభై ఐదు ఎకరాల అటవీ భూమి ఉందని తేలడంతో వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరుక కలెక్టర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గురువారం భూములను అధికారికంగా స్వాధీనం చేసుకుని బోర్డులు పాతనున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఆస్తులు, భూములు సహా దేన్నీ వైసీపీ పెద్దలు వదల్లేదు. ముఖ్య సలహాదారుగా ప్రభుత్వాన్ని శాసించిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కూడా తగ్గలేదు. ఇప్పుడు అటవీ భూముల్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ అంశంపై సజ్జల కుటుంబం సైలెంట్ గా ఉంది. ఎలాంటి ప్రకటన చేయలేదు.