సమస్య ఏదైనా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కారం అవుతుందనే ఆలోచనకు వచ్చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఆయన దృష్టికి వచ్చిన సమస్య పట్ల క్షణాల్లో స్పందిస్తున్నారు. సంబంధిత అధికారులు , వ్యక్తులతో మాట్లాడుతూ వడివడిగా పరిష్కరించేస్తున్నారు. దీంతో సమస్య ఎలాంటిదైనా సొల్యూషన్ నారా లోకేష్ అంటూ.. ఆయన్ను కలిసేందుకు టీడీపీ కార్యకర్తలతోపాటు సాధారణ ప్రజలు కూడా క్యూ కడుతున్నారు.
మంగళవారం మంత్రి నారా లోకేష్ అమరావతిలోని పార్టీ కార్యాలయానికి వస్తారని టీడీపీ కేడర్ కు సమాచారం అందింది. ఇంకేముంది.. సమస్యలతో కేడర్ అంతా ఆయన రాకకు ముందే ఉదయం నుంచే కార్యాలయం వద్ద బారులు తీరారు. లోకేష్ వస్తే తమ సమస్య చెప్పుకునేందుకు రెడీగా ఉన్నారు. అయన రాకకు ఆలస్యం అవుతుందని తెలిసినా..మధ్యాహ్నం భోజనం పక్కనపెట్టి లోకేష్ కోసం వేచిచూస్తూనే ఉన్నారు.
టీడీపీ కార్యకర్తలు వెంటబెట్టుకొని వచ్చిన అర్జీలు తమకు ఇవ్వండి.. లోకేష్ కు అందిస్తామని టీడీపీ కార్యాలయ సిబ్బంది చెప్పినా ససేమీరా నిరాకరించారు. లోకేష్ వచ్చేదాక ఇక్కడే ఉంటామని.. ఆయన వచ్చాక ఆర్జీలను స్వయంగా అందిస్తామని చెప్పుకొచ్చారు. లోకేష్ ను కలిసి సమస్యను వివరిస్తే క్షణాల్లో ముగిసిపోతుందని పార్టీ కేడర్ బలంగా నమ్ముతున్నట్లుగా ఈ పరిణామం రూడీ చేస్తోంది.


