నల్ల కుబేరుల్ని ఏరి పారేయడానికి, వాళ్ల దగ్గరున్న బ్లాక్‌మనీని చేజిక్కించుకోవడానికి మోడీ వేసిన ఎత్తుగడ.. రూ.500, రూ.1000 నోట్ల రద్దు. ఈ నిర్ణయం పట్ల పేద, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తే, ధనికుల పరిస్థితి కక్కలేక – మింగలేక అన్నట్టు తయారైంది. ఈ ప్రభావం సినీ పరిశ్రమలో విపరీతంగా పడింది. మోడీ ప్రకటన బయటకు వచ్చినప్పటి నుంచీ… తమ బ్లాక్‌ని వైట్లోకి ఎలా మార్చుకోవాలా అనే ఆలోచనలో పడ్డారు మన స్టార్ హీరోలూ, డైరెక్టర్లూ. మోడీ నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేసినవాళ్లే ఎక్కువ. ‘ఇదేంటి మోడీజీ’ అని అడగడానికి మన హీరోలకు ధైర్యం లేకుండా పోయింది. తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రం ఈ నోట్ల రద్దు వ్యవహారంపై గళం విప్పడం, మోడీ నిర్ణయానికి కుసింత వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ”నిర్ణయం మంచిదే.. అమలు పరచిన విధానం బాలేదు” అంటూ మోడీ నిర్ణయాన్ని తప్పు పట్టే ధైర్యం చేశాడు విజయ్.
విజయ్ లాంటి స్టార్ హీరో, జనాభిమానం ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదనుకొంటా. 20 శాతం ధనికుల్ని ని టార్గెట్ చేయడానికి 80 శాతం పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదంటూ విజయ్ చేసిన కామెంట్ షాకింగ్ గా మారింది. మోదీ తీసుకొన్న నిర్ణయం తప్పుపట్టలేం. అలాగని జన సామన్యం పడుతున్న బాధనీ సమర్థించలేం. ”మంచి పని చేస్తున్నాం కాబట్టి ఈ బాధని ఓర్చుకోవాల్సిందే” అనడం కూడా కరెక్ట్ కాదు. రెక్కాడితేగానీ డొక్కాడని ఎంతోమంది పేద ప్రజలు రూ.500 కాగితాల మార్పిడి కోసం గంటల తరబడి క్యూలో నిలబడి విస్తుపోతున్నారు. అయితే దురదృష్టం.. వాళ్ల తరపున మాట్లాడే నాయకుడు లేడు. వాళ్ల బాధల్ని తీర్చడానికి ఇప్పటి వరకూ ఏ లీడరూ ముందుకు రాలేదు. సినిమా స్టార్లు కూడా ”మోడీ తుమ్ గ్రేట్ హో” అన్నట్టు చప్పట్లు కొట్టారు. లోపల కాలిపోతున్నా (బ్లాక్ మనీ గుట్టలు గుట్టలుగా ఉన్నవాళ్లకే ఈ మాట వర్తిస్తుంది) పైకి మాత్రం నవ్వు పులుముకొంటూ తిరుగుతున్నారు. పొరపాటున తమ బాధని వెళ్లగక్కితే.. ”నీ ఇంట్లో ఎంత బ్లాక్ మనీ ఉంది” అంటూ వేలెత్తి చూపిస్తారేమో అన్న భయం వాళ్లది.
పైగా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలనుకొనేవారు ఏం చేసినా మిన్నకుండాల్సిందే. అయితే విజయ్ మాత్రం స్పందించిన తీరు. నిర్మొహమాటంగా బాధని వెళ్లగక్కిన విధానం అందరికీ నచ్చింది. విజయ్ కూడా మన హీరోల్లానే కోట్లకు కోట్లు పారితోషికం తీసుకొంటున్నవాడే. బహుశా ఆయనా దగ్గరా బ్లాక్ మనీ ఉండే ఉంటుంది. ఇక్కడ పాయింట్ అది కాదు. ప్రజల కోసం.. ప్రజల తరపున మాట్లాడే గొంతు కరువైనప్పుడు ఓ వెలుగు కనిపించింది. అంతే. ఈ పాటి ధైర్యం మన హీరోలు చేయరు.. చేయలేరు. ఎందుకంటే నీతులు చెబుదామనుకొంటే… వెనుక ఉన్న గోతులు నవ్వుతాయి కదా?