మా సినిమాకు పార్ట్ 2 ఉంది.. అంటూ దర్శక నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్లలో హడావుడి చేస్తుంటారు. క్లైమాక్స్ లో ఓ లీడ్ కూడా ఇస్తుంటారు. కానీ తీరా చూస్తే పార్ట్ 2 ఉండదు. సినిమా బాగుంటే అప్పుడు ఆలోచిస్తారంతే. పార్ట్ 2 ఉంది అని చెప్పి, చివర్లో చేతులెత్తేసిన ప్రాజెక్టులు ఎన్నో. ఆ జాబితాలో ‘హరి హర వీరమల్లు’ కూడా చేరిపోతుంది. పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబోలో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఎన్నో అవాంతరాల్ని దాటుకొని పూర్తయ్యింది. పార్ట్ 2 ఉంటుందని చిత్రబృందం గట్టిగా చెప్పింది. అయితే ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ సైతం.. ‘పార్ట్ 2’ లేదనే సంకేతాల్ని బలంగా ఇస్తోంది.
‘హరి హర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ సరసన నటించే ఛాన్స్ అందుకొంది.. నిధి. ఆ సినిమా ప్రమోషన్లలో విరివిగా పాలుపంచుకొంది. చాలా ఆశలు కూడా పెట్టుకొంది. అయితే సరైన ఫలితం రాలేదు. ఇప్పుడు ‘రాజాసాబ్’లో ప్రభాస్ పక్కన నటించింది. ‘రాజాసాబ్’ ప్రమోషన్లలో కూడా నిధి బిజీ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ‘వీరమల్లు 2 ఉందా’ అనే ప్రశ్న నిధికి ఎదురవుతోంది. దీనికి నిధి కూడా స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. ‘దాని గురించి ఇప్పుడే మాట్లాడలేను. మొదలైనప్పుడు చూద్దాం..’ అంటూ సమాధానం దాట వేస్తోంది. నిజానికి నిధి పాత్ర పార్ట్ 1లో తక్కువే. పార్ట్ 2 కోసం ఎక్కువగా దాచారు. కానీ ఇప్పడు పార్ట్ 2 కూడా లేకుండా పోయింది. అన్నట్టు ‘రాజాసాబ్’ సినిమాకు కూడా పార్ట్ 2 ఉందని ప్రచారం జరుగుతోంది. మరి దాని సంగతేంటో విడుదలైన తరవాతే తేలుతుంది.
