వచ్చే ఏడాది బాక్సాఫీస్ మామూలుగా ఉండదు. బడా ప్రాజెక్టులతో హోరెత్తిపోనుంది. మహేష్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలన్నీ 2027కి షిఫ్ట్ అయ్యాయి. ప్రతీ సీజన్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ పలకరించడం ఖాయంగా కనిపిస్తోంది. యువ హీరో తేజా సజ్జా కూడా 2027ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. 2024లో `హనుమాన్`తో సూపర్ హిట్ కొట్టిన సజ్జా… 2025లో `మిరాయ్`తో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకొన్నాడు. 2026లో తన నుంచి సినిమా ఏదీ రాకపోవొచ్చు. కానీ 2027లో మాత్రం మూడు సీక్వెల్స్ ని రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్నాడు.
అందులో భాగంగా ‘జాంబీ రెడ్డి 2’ ఈ వేసవిలో మొదలెట్టబోతున్నారు. 2027 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన వుంది. ‘మిరాయ్ 2’ కూడా స్క్రిప్టు సిద్ధం చేసుకొంటోంది. ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ వుంది. 2027 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మధ్యలో ‘జై హనుమాన్’ ఉంది. రిషబ్ శెట్టి ఈ చిత్రంలో హనుమంతుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో తేజా సజ్జా కూడా కనిపిస్తాడు. కానీ గెస్ట్ రోల్ మాత్రమే. ఎలా చూసినా.. తేజా నుంచి ఒకే యేడాది మూడు సీక్వెల్స్ వస్తాయి. ఒకే హీరో.. వరుసగా మూడు సీక్వెల్స్ చేయడం కూడా అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ‘జాంబీ రెడ్డి 2’ కథపై కసరత్తులు చురుగ్గా సాగుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ రావొచ్చు.
