తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదిక తేల్చిందంటూ వైసీపీ నేతలు గత కొద్దిరోజులుగా చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అయితే, సిట్ ఛార్జిషీటులో కేవలం బీఫ్ టాలో లేదా లార్డ్ లాంటి ప్రత్యక్ష జంతు కొవ్వులు లేవని మాత్రమే పేర్కొన్నారు. కానీ రసాయనాలు, వెజిటబుల్ ఆయిల్స్ తో కూడిన ఒక కృత్రిమ మిశ్రమాన్ని నెయ్యిగా సరఫరా చేశారని చెప్పింది. ఈ మిశ్రమంలో రసాయన ప్రయోగాల వల్ల జంతు కొవ్వుల ఉనికిని తక్కువ స్థాయిలో గుర్తించడం లేదా అవి ఇతర పదార్థాలతో కలిసి ఉండవచ్చనే కోణంలో ఛార్జిషీటులోని అంశాలు ఉన్నాయి. ఇది బయటకు రాకుండా వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పక్కా ఆధారాలతో తిప్పికొట్టేందుకు రెడీ అయింది.
అసెంబ్లీలోనే అన్ని ఆధారాలు
వైసీపీ నేతలు బయట చేస్తున్న రచ్చకు అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చే అధికారిక సమాధానం ఒక గట్టి షాక్ కానుంది. గతంలో వచ్చిన ల్యాబ్ రిపోర్టులు, సిట్ సేకరించిన సాక్ష్యాలు, నిందితులుగా పేర్కొన్న డెయిరీ యజమానుల వాంగ్మూలాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. కేవలం నెయ్యి నాణ్యత తగ్గడమే కాకుండా, అసలు పాలు, వెన్న లేకుండా కేవలం రసాయనాలతో సింథటిక్ నెయ్యి ని ఎలా తయారు చేసి పంపారో తేదీలతో సహా వివరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేశారు. ఇది కేవలం కల్తీ మాత్రమే కాదు, భక్తుల మనోభావాలతో ఆడుకున్న భారీ కుట్రగా వైసీపీని ఆత్మరక్షణలో పడేయాలని అధికార పక్షం భావిస్తోంది.
వైసీపీ ప్రచారం, గగ్గోలుకు గట్టి సమాధానాలు
అసెంబ్లీలో ప్రభుత్వం ఇన్ని ఆధారాలు పెడుతున్నప్పుడు, వైసీపీ నేతలు సభకు వచ్చి కౌంటర్ ఇవ్వగలరా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో సభా కార్యక్రమాలను బహిష్కరించిన వైసీపీ, ఈసారి లడ్డూ వివాదంపై తమ వెర్షన్ వినిపించడానికి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సభకు రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందని, వస్తే ప్రభుత్వ ఆధారాల ముందు నిలబడటం కష్టమవుతుంది. సిట్ ఛార్జిషీటును తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేస్తున్న వైసీపీకి, సభలో ప్రభుత్వం ఇచ్చే వివరణ ఒక లిట్మస్ టెస్ట్ కానుంది.
అసెంబ్లీకి వచ్చి వైసీపీ సమర్థించుకోగలదా?
యానిమల్ ఫ్యాట్ అనే పదాన్ని పట్టుకుని వైసీపీ తప్పించుకోవాలని చూస్తుంటే, కల్తీ నెయ్యి – భక్తుల ద్రోహం అనే నినాదంతో ప్రభుత్వం దాడికి దిగుతోంది. అసెంబ్లీలో జరిగే ఈ చర్చ ద్వారా ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపాలని, తద్వారా వైసీపీ హిందూ ద్రోహాన్ని చాటాలని అనుకుంటోంది. వైసీపీ నేతలు బయట ఎంత రచ్చ చేసినా అసెంబ్లీలో చెప్పేదే అధికారికం. మరి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వగలరా?
