కాంగ్రెస్ గందరగోళ పరిస్థితికి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉదాహరణగా మారింది. సోమవారం మీనాక్షి నటరాజన్ పాదయాత్రను ఘనంగా ప్రకటించారు. మంగళవారం వాయిదా వేశారు. బుధవారం.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పాదయాత్ర జరుగుతుందని .. ఆ పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ పాల్గొంటారని ప్రకటించారు. దీంతో మూడు రోజుల్లో మూడు సార్లు కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లయింది.
మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అనే సరికి.. పార్టీ వ్యవహారాలు చక్కదిద్దిమని పంపితే.. ఆమె తానే లీడర్ అన్నట్లుగా పాదయాత్ర చేయడం ఏమిటన్న ఆశ్చర్యం వ్యక్తమయింది. బీజేపీ నేతలు కూడా విమర్శలు చేశారు. ఆ పాదయాత్రలేవో మధ్యప్రదేశ్ లో చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేదిగా అన్న సెటైర్లు కూడా వినిపించాయి. మీనాక్షి పాదయాత్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందన్న అభిప్రాయం వినిపించడంతో వాయిదా ప్రకటన చేశారు. ఢిల్లీ పర్యటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.
అయితే ఈ అంశంపై గందరగోళం ఎందుకని.. మహేష్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశం తర్వాత మళ్లీ పాదయాత్ర కొనసాగింపు ప్రకటన వచ్చింది. కానీ ఇక్కడ ప్రధాన పాత్రధారులు మారారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాదయాత్ర చేస్తారని.. అందులో మీనాక్షి నటరాజన్ పాల్గొంటారని చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్ర వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్ని బయట పెట్టింది.