రివ్యూ: ‘అహ నా పెళ్ళంట’ (వెబ్ సిరీస్‌)

Aha Na Pellanta Web Series review

రాజ్‌తరుణ్‌ కి గత కొద్ది కాలంగా పెద్దగా కలసి రావడం లేదు. ఎన్ని జోనర్లు ట్రై చేసినా `మళ్ళీ సూపర్ హిట్` అనుకునే విజయం మాత్రం దక్కడం లేదు. అయితే కోవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ‘ఒరేయ్ బుజ్జిగా’ కి ఓ మాదిరి స్పంద‌న వచ్చింది. ఇప్పుడు జీ5 ఓటీకి ‘అహ నా పెళ్ళంట’ పేరుతో వెబ్ సిరిస్ చేశాడు రాజ్‌తరుణ్‌. శివానీ రాజశేఖర్‌ కథానాయిక. రాజ్ తరుణ్ చేసిన తొలి వెబ్ సిరిస్ ఎలాంటి అనుభూతిని ఇచ్చింది ? ప్రేక్షకుల చేత ‘ఆహా..’అనిపించిందా?

పెళ్లికి ముందు హనుమంతుడిలా, పెళ్లి తర్వాత రాముడిలా ఉండాలనుకునే కుర్రాడు శ్రీను (రాజ్‌తరుణ్‌). దీనికి కారణం.. శ్రీను తండ్రి నోబాల్‌ నారాయణ (హర్షవర్థన్‌). శ్రీను చిన్నప్పుడు స్కూల్ లో రాముడి వేషం వేస్తాడు. శివధనుస్సు విరిచి స్టేజ్ పై వున్న ఓ అమ్మాయికి ‘ఐ లవ్ యూ’ చెబుతాడు. శ్రీను వాలకం చూసి తండ్రి నోబాల్‌ నారాయణ.. పెళ్లి చేసుకునేవరకూ అమ్మాయిలని కన్నెత్తి చూడకూడదని ఒట్టు వేయించుకుంటాడు. తండ్రికి మాటిచ్చి శ్రీను.. ఇక అమ్మాయిల చాప్టర్ ని తన జీవితం నుంచి డిలీట్ చేస్తేస్తాడు. శ్రీనుకి పెళ్లీడు వస్తుంది. పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెబుతాడు. ఇక సంబంధాలు చూడటం మొదలుపెడతారు. చాలా సంబంధాలు చూసిన తర్వాత శ్రీనుకి ఓ అమ్మాయి నచ్చుతుంది. తీరా పెళ్లి పీటలెక్కిన తర్వాత పెళ్లికూతురు తను ప్రేమించిన అబ్బాయితో పెళ్లిరోజే లేచిపోతుంది. దీంతో ఒంటరిగా పెళ్లి పీటలపై మిగిలిపోతాడు శ్రీను. స్నేహితులు, సమాజం హేళన చేస్తుంది. అయితే తన పెళ్లి చెడిపోవడానికి కారణం మహా (శివానీ రాజశేఖర్‌) తెలుసుకుంటాడు శ్రీను. మహా పెళ్లి కూడా చెడగొట్టి ఆమె పై రివెంజ్ తీర్చుకునే అవకాశం వస్తుంది. మహాను పెళ్లి రోజే కిడ్నాప్‌ చేస్తాడు. అయితే అనుకోని పరిస్థితిలో మహాని తన ఫ్లాట్ లోనే ఆశ్ర‌యం ఇవ్వాల్సి వస్తుంది. మరి తర్వాత శ్రీనుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అసలు శ్రీను పెళ్లి మహా ఎందుకు చెగొట్టింది? తనని కిడ్నాప్ చేసింది శ్రీనునే అని మహా తెలుసుకుందా ? వారి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది ? అనేది మిగతా కథ.

పెళ్లి కూతురు లేచిపోవడంతో పెళ్లి పీటలపై ఒంటిరిగా మిగిలిపోయిన ఓ కుర్రాడి కథ ఇది. ఇదే లైన్ తో కొన్ని కథలు వచ్చాయి. త్రివిక్రమ్ కెరీర్ ప్రారంభంలో రాసిన ‘చిరునవ్వుతో’ ఈ టాపిక్ తోనే మొదలౌతుంది. అయితే ఆ కథలో కథానాయకుడు వేణు ”అమ్మాయికి నేను నచ్చకపోతే ప్రాబ్లమ్ నాది కాదు తనది” అని పాజిటివ్ గా ముందుకెళిపోతాడు. ‘అహ నా పెళ్ళంట’ లో మాత్రం తన పరువుపోయిందని ఫీలైపోయి, అలా జరగడానికి కారణం తెలుసుకొని, కారణమైన వారిపై రివేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు హీరో. ఆ రివేంజ్ తీర్చుకునే ప్రయత్నంలో జరిగిన డ్రామా కొన్ని చోట్ల సినిమాలా, కొన్ని చోట్ల‌ వెబ్ సిరిస్ లా, మరి కొన్ని చోట్ల సీరియల్ గా, ఇంకొన్ని చోట్ల షార్ట్ ఫిల్మ్ లాంటి అనుభూతిని ఇస్తుంది.

నోబాల్‌ నారాయణ రంజీ మ్యాచ్ తో కథ మొదలౌతుంది. ఆ నోబాల్ ఎపిసోడ్ నవ్విస్తుంది. తర్వాత శ్రీను చైల్డ్ వుడ్ సీన్లు, తండ్రి మాట తీసుకోవడం, శ్రీను పెద్దయ్యాక ఫ్రెండ్స్ తో అల్లరి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం, పెళ్లి చూపులు చకచక సాగిపోతాయి. కథలో మెయిన్ పాయింట్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ లోనే వచ్చేస్తుంది. పెళ్లి ఆగిపోయిన తర్వాత శ్రీనుని హైదరాబాద్ పంపించడం చిరునవ్వుతో లో వేణు రూటే. తన పెళ్లి చెడిపోవడానికి కారణం,..మహా అని తెలుసుకున్న తర్వాత పోసానితో కలసి కిడ్నాప్ డ్రామా ప్లాన్ చేయడం వరకూ స్క్రీన్ ప్లే హుషారుగానే వుంటుంది. అయితే ఎప్పుడైతే కిడ్నాప్ డ్రామా మొదలైయిందో .. తర్వాత వ‌చ్చిపోయే స‌న్నివేశాలు అంత‌గా ర‌క్తి క‌ట్ట‌వు. మహాని మళ్ళీ శ్రీను ఫ్లాట్ లోకి తెచ్చే విధంగా ఒక ప్లేని అల్లుకొన్న దర్శకుడు.. తర్వాత మూడు ఎపిసోడ్లని వెబ్ సిరిస్ కి తక్కువ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ అన్నట్లు నడిపాడు. మహా శ్రీను ఫ్లాట్ లోకి ఎంటరైన తర్వాత కథనం మరీ ఫ్లాట్ తయారైయింది. డ్రామా ఎంతకీ ముందుకి కదలదు. కథకు బలం చేకూరని సన్నివేశాలతో సోసోగా లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.

ప్రీ క్లైమాక్స్ కూడా అంత పకడ్బందీగా వుండదు. పాత్రలన్నీ ఉన్నపళంగా మారిపోతుంటాయి. శ్రీను పేరుతో మరో పాత్రని క్రియేట్ చేసి ఒరేయ్ బుజ్జిగా టైపులో కన్ ఫ్యుజన్ డ్రామా పండించాలని చూశారు. అయితే అదీ అంతగా పండలేదు. శ్రీను – మహా దూరం అవుతున్నపుడు వీరిద్దరూ కలిసే వుండాలనే ఫీలింగ్ ఆడియన్స్ లో కలగాలి. కానీ వాళ్ళ కెమిస్ట్రీ ని అలా డిజైన్ చేయలేదు. శ్రీను మహా పాత్రలకు ఒక బ్యాక్ స్టొరీ పెట్టారు. అయితే అదంత పే చేయలేదు. ఇద్దరూ వేరే వాళ్లతో పెళ్లికి రెడీ అయిపోయినపుడు వాళ్ళ గతంలో ఎంత స్వీట్ ఇన్సిడెంట్ వున్నా ..ప్రేక్షకుడికి అనవసరం. శ్రీను మహాలా కెమిస్ట్రీని ఇంకాస్త బలంగా డిజైన్ చేసుంటే బావుండేది. ఇలాంటి రొమాంటిక్ డ్రామాలకి సంచలనమైన ముగింపులు వుండవు. కానీ ‘అహ నా పెళ్ళంట’ ముగింపుని కాస్త సంచలనంగా ప్లాన్ చేసి విమానం, బాంబు బ్లాస్ట్ అంటూ హడావిడి చేశారు. అయితే ఉత్త హడావిడిగానే మిగిలి చివరికి రొటీన్ గానే జరిగింది

రాజ్ తరుణ్ కి అలవాటైన పాత్రే ఇది. బేసిగ్గా రాజ్ తరుణ్ కి ఎనర్జీ ఎక్కువ. అయితే శ్రీను పాత్రని కాస్త టెంపో తగ్గించి డిజైన్ చేశారు. రాజ్ తరుణ్ టైమింగ్ ఎప్పటిలానే ఆకట్టుకుంది. మహా పాత్రలో శివాని చాలా చలాకీగా కనిపించింది. కూల్ గా లైట్ గా వుండే పాత్రది. వారి మధ్య కెమిస్ట్రీ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. హర్ష వర్షన్ నో బాల్ నారాయణ గా నవ్విస్తాడు. తన పాత్రలో ఎమోషన్ కూడా వుంది. అయితే కొడుకు మాట తప్పిన ప్రతిసారి అతనికి ఎదో గాయం అవుతుంది. ఈ ట్రాక్ ని మాత్రం దర్శకుడు సరిగ్గా ముడిపెట్టలేకపోయాడు. తల్లిగా చేసిన ఆమని ఓకే. పోసానిది ఒకరంగా విలన్ పాత్ర. ఆయన అనుభవం చూపించారు. గెటప్ శ్రీను, మిగతా పాత్రధారులు పరిధిమేర చేశారు. కటింగ్ దివాకర్ గా తాగుబోతు రమేష్ కాసేపే కనిపించినా నవ్విస్తాడు.

సాంకేతికంగా సిరిస్ డీసెంట్ గానే వుంది. దర్శకుడు సంజీవ్ రెడ్డి లైటర్ వెయిన్ డ్రామాగా ప్రజంట్ చేయాలని ప్రయత్నం చేశాడు. అయితే తొలి రెండు ఎపిసోడ్స్ లో కనిపించిన వేగం మిగతా ఎపిసోడ్స్ లో లేదు. మాటల రచయిత కళ్యాణ్ రాఘవ్ చాలా చోట్ల యతి ప్రాసల కోసం ప్రయత్నించినప్పటికీ .. కొన్ని మెరపులు మెరిపించాడు. ”మనసుకి మూరడు మల్లెపువ్వులు కూడా రావు’. ఆ అమ్మాయి.. పక్కోడి అన్సర్ షీట్‌ లా కనిపించి కనిపించనట్లుగా కనిపించింది.. ‘కొప్పులో ప్రాణం చెప్పులోకి వచ్చింది” ఇలాంటి మాటలు కొన్ని ఆకట్టుకుంటాయి. డీవోపీ ప‌నిత‌రం నీట్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త సార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణంలో కొన్ని బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి.

మంచి వెబ్ సిరిస్ కి లక్షణం.. ఒక ఎపిసోడ్ మొదలుపెట్టిన తర్వాత బ్రేక్ ఇవ్వకుండా సిరిస్ మొత్తం చూసేయాలనిపించాలి. ‘అహ నా పెళ్ళంట’ మొదటి మూడు ఎపిసోడ్లు ఆహా అనిపించినా.. తర్వాత.. సర్లే తీరకవున్నపుడు చూద్దామనుకునే కేటగిరీలోకి వెళ్ళే సిరిస్ ఇది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

ఏపీ సచివాలయ ఉద్యోగులకే అగ్నిపరీక్షలు – ఫెయిలయితే ?

ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని వర్గ శత్రువులుగా భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏ విభాగ ఉద్యోగికి లేనన్ని ఆంక్షలు పెడుతోంది. నిబంధనలు అమలు చేస్తోంది. సచివాలయ ఉద్యోగాలన్నీ కార్యాలయంలో కూర్చుని...

మరో అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం !

కేటీఆర్ నాయకత్వ లక్షణాలు.. ఆయన విజన్.. చేస్తున్న అభివృద్ధి అంతర్జాతీయంగా పేరు తెచ్చి పెడుతోంది. మరో అంతర్జాతీయ సమావేశాలకు ఆహ్వానం అందింది. అమెరికా హెండర్సన్‌లో జరగనున్న పర్యావరణ-జలవనరుల సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....

పొత్తుండని టీడీపీ చెప్పకపోవడమే ఏపీ బీజేపీ నేతలకు అలుసైందా ?

ఏపీ బీజేపీ నేతలు ముఖ్యంగా ప్రో వైసీపీ గ్యాంగ్ గా ప్రసిద్ధి చెందిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు పదే పదే టీడీపీతో పొత్తులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close