సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే ఇప్పటి వరకూ .. డాక్టర్లకూ లేనంత హోదా ఉంది. కానీ ఇప్పుడు కాదు. ఇక ముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే అవసరం ఉండదని ఇండస్ట్రీ చెబుతోంది. అందులో అతిశయోక్తి లేదు. సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. ఏఐ మనుషుల ఉద్యోగాలను మింగేస్తుందా అని. ఆంత్రోపిక్ లాంటి సంస్థలు అభివృద్ధి చేసిన ఏఐ మోడల్స్ ఇప్పుడు కేవలం సూచనలు ఇస్తే చాలు, మొత్తం కోడ్‌ను రాసి పెడుతున్నాయి. దీనివల్ల కేవలం కోడింగ్ మీదనే ఆధారపడే వారికి గడ్డు కాలం తప్పదు. అయితే ఇది వారికి సంక్షోభం మాత్రమే కాదు..గొప్ప అవకాశం
ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే!
జోహో అధినేత శ్రీధర్ వెంబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. కోడింగ్ ద్వారానే జీవనోపాధి పొందుతున్న వారు ప్రత్యామ్నాయాలను చూసుకోవడం ఉత్తమం అని ఆయన కుండబద్దలు కొట్టారు. సాఫ్ట్వేర్ డెవలపర్లు రాసే కోడ్‌లో దాదాపు 90 శాతం బాయిలర్ ప్లేట్ అని, దానిని ఏఐ సులువుగా చేసేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రోగ్రామింగ్ రంగంలో అధిక జీతాలు తమ జన్మహక్కు అని భావించే రోజులు పోయాయని, అప్రమత్తంగా ఉన్నవారే ఈ పోటీలో మనుగడ సాగిస్తారని ఆయన హితవు పలికారు.
ఏఐ కూడా అవకాశాల గని
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఏఐ ప్రభావాన్ని అంగీకరించారు. గూగుల్‌లో కొత్తగా రూపొందుతున్న కోడింగ్‌లో ఇప్పటికే 25 శాతం కంటే ఎక్కువ ఏఐ సాయంతోనే జరుగుతోందని ఆయన వెల్లడించారు. అయితే, పిచాయ్ దీనిని ఒక సానుకూల కోణంలో చూస్తున్నారు. ఏఐ వల్ల ఇంజనీర్ల ఉత్పాదకత పెరుగుతుందని, రొటీన్ పనుల నుంచి విముక్తి లభించి సృజనాత్మకమైన పనులపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఏఐ ఒక ప్రత్యామ్నాయం కాదు, అది ఒక కో-పైలట్ అని ఆయన నమ్ముతున్నారు. ఇందులో అవకాశాలు అనంతంగా ఉంటాయని ఆయన విశ్లేషిస్తున్నారు.
భయం వద్దు.. మార్పును ఆహ్వానించండి
ఏఐ వస్తోందని భయపడిపోయి కాడి పడేయాల్సిన అవసరం లేదు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు కానీ, ఏఐని వాడుకోవడం తెలియని వారు మాత్రం వెనకబడిపోతారు. గతంలో టైప్రైటర్ల నుంచి కంప్యూటర్లకు మారినప్పుడు ఎలాగైతే ఒక విప్లవం వచ్చిందో, ఇప్పుడు కోడింగ్ నుంచి ఏఐ అసిస్టెడ్ ఇంజనీరింగ్ వైపు మళ్లడం కూడా అంతే అనివార్యం. కేవలం కోడర్లుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ప్రాబ్లమ్ సాల్వర్లు గా మనం మారాలి. సాఫ్ట్వేర్ నిపుణులు తమను తాము నిరంతరం అప్డేట్ చేసుకోవాలి. ఏఐ టూల్స్‌ను ఎలా వాడాలి.. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి.. సంక్లిష్టమైన సమస్యలను ఏఐ ద్వారా ఎలా పరిష్కరించాలి.. అన్న అంశాలపై పట్టు సాధించాలి. సాంకేతికత మారుతున్నప్పుడు దానితో పాటు మనం మారకపోతే కాలగర్భంలో కలిసిపోతాం. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడమే అసలైన విజేత లక్షణం అనేది ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నమాట.
మార్పు ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తుంది, కానీ అది అభివృద్ధికి నాంది. ఏఐని శత్రువుగా కాకుండా ఒక శక్తివంతమైన సాధనంగా చూస్తూ ముందుకు సాగితే సాఫ్ట్వేర్ రంగంలో మరిన్ని విజయాలు అందుకోవచ్చు.
