ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తున్న తరుణంలో అందరూ సర్వరోగ నివారిణిగా దాన్నే వాడుతున్నారు. మనుషులను ఉద్యోగాల నుంచి తీసేసి ఆ ఏఐతో పనులు చేయించేసుకుంటున్నారు. కానీ ఏఐపైనే పూర్తి స్థాయి ఆధారపడటం వల్ల తలెత్తే ముప్పుల గురించి అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదు. రేపటి రోజున ఇదే అతి పెద్ద సమస్యగా మారబోతోంది.
మానవమేధస్సుకు పెనుగండం
ఏఐకి పనులు అప్పగించడం వల్ల మానవ మేధస్సు, నైపుణ్యాలు క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, కోడింగ్ లేదా కంటెంట్ రైటింగ్ కోసం పూర్తిగా ఏఐని వాడితే, భవిష్యత్తులో ఆ ఏఐ వ్యవస్థ విఫలమైనప్పుడు ఆ పనిని సొంతంగా చేయగల మ్యాన్ పవర్ సిద్ధంగా ఉండదు. ప్రాథమిక నైపుణ్యాలు లేని శ్రమశక్తి ఏ దేశానికైనా భారమే.
ఏఐ బ్లాక్ బాక్స్
ఏఐ ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో కొన్నిసార్లు దానిని సృష్టించిన వారికే అర్థం కాదు. దీనిని బ్లాక్ బాక్స్ అంటారు. ఒకవేళ టెక్నికల్ బగ్స్ వల్ల ఏఐ తప్పుడు సమాచారాన్ని ఇస్తే, ఆ తప్పును గుర్తించే స్థాయిలో మానవ పర్యవేక్షణ ( లేకపోతే భారీ నష్టాలు తప్పవు. ముఖ్యంగా వైద్య, రక్షణ రంగాల్లో ఇది ప్రాణాపాయానికి దారితీయవచ్చు. కేవలం క్లౌడ్ ఆధారిత ఏఐలపైనే సంస్థలు నడిస్తే, సర్వర్ డౌన్ అయినప్పుడు లేదా భారీ సైబర్ దాడి జరిగినప్పుడు మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది. సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది టెక్నాలజీలో అతిపెద్ద ప్రమాదం. ప్రత్యామ్నాయ మ్యాన్ పవర్ లేని పక్షంలో వ్యాపారాలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి.
డేటా కాలుష్యం
అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం, ఏఐ సృష్టించిన డేటాను ఉపయోగించి మళ్ళీ ఏఐకి శిక్షణ ఇస్తే కాలక్రమేణా ఆ ఏఐ తెలివితేటలు తగ్గిపోయి, అసంబద్ధమైన సమాచారాన్ని ఇస్తుంది. దీనిని మోడల్ కొల్లాప్స్ అంటారు. ఈ దశలో మళ్ళీ నాణ్యమైన పని కోసం మనుషుల అవసరం కచ్చితంగా ఏర్పడుతుంది. అప్పటికే మ్యాన్ పవర్ తగ్గించుకున్న సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడతాయి. ఏఐ ఉన్న డేటాను విశ్లేషించగలదు కానీ, మనిషిలాగా కొత్త ఆలోచనలను లేదా భావోద్వేగాలతో కూడిన నిర్ణయాలను తీసుకోలేదు. సంక్షోభ సమయాల్లో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన కామన్ సెన్స్ ఏఐకి ఉండదు. మానవ వనరులను పూర్తిగా తొలగించడం అంటే సంస్థ సృజనాత్మక ఆత్మను చంపుకోవడమే.
పనిలో తప్పు జరిగితే ఏఐని శిక్షించలేము , జవాబుదారీని చేయలేము. బాధ్యత వహించడానికి ఒక మనిషి ఉండాలి. కేవలం ఖర్చు తగ్గించుకోవడమే ధ్యేయంగా మ్యాన్ పవర్ తగ్గించుకుంటే, సమాజంలో నిరుద్యోగం పెరిగి వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఇది తిరిగి ఆర్థిక వ్యవస్థకే నష్టం కలిగిస్తుంది. ఏఐని ఒక సహాయకారి లాగా చూడాలే తప్ప, ప్రత్యామ్నాయం లాగా చూడకూడదు. టెక్నాలజీ ఎంత పెరిగినా, దానికి పగ్గాలు వేసే హ్యూమన్ బ్యాకప్ లేకపోతే మొదటికే మోసం వస్తుందన్నది అందరూ గుర్తించాల్సిన నిజం.
