తమిళనాడు ఎన్నికల్లో ఉచిత హామీలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పడం కష్టంగా మారుతోంది. మొదటి దశ హామీలు అంటూ అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి కొన్ని హామీలు ప్రకటించారు. అందులో ఫ్రీబస్సు ఒకటి. నీకంటే నేనే ఎక్కువ ఇస్తా అనే వేలంలో పార్టీలు పోటీ పడుతున్నట్లుగా పథకాలు ప్రకటించారు. డిఎంకె అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడుతూనే, వాటికి మరిన్ని అదనపు హంగులు జోడించి అన్నాడీఎంకే రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టో టీజర్ మాత్రమే.
అన్నాడీఎంకే ప్రకటించిన మొదటి విడత హామీల్లో డిఎంకె ప్రభుత్వం మహిళలకు ఇచ్చే 1000 రూపాయల మగువల హక్కు పథకానికి కౌంటర్ ఇచ్చేలా, తాము అధికారంలోకి వస్తే 2000 రూపాయలు ఇస్తామని పథకాన్ని తెరపైకి తెచ్చారు. అంటే దీనికి తోడు 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ల పంపిణీ , ఉపాధి హామీ పని దినాల పెంపు వంటి హామీలతో ఓటర్ల మీద వరాల వర్షం కురిపించారు. స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పేరుతో మహిళా ఓటు బ్యాంకును గంపగుత్తగా కొల్లగొట్టగా, ఇప్పుడు పురుషులను కూడా బుజ్జగించడానికి పళనిస్వామి బస్సు డోర్లు బార్లా తెరిచేశారు.
ఈ హామీల వెనుక ఉన్న లాజిక్‌ను చూసి ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో జయలలిత మిక్సీలు, గ్రైండర్లు ఇస్తే, ఇప్పుడున్న నాయకులు అంతకుమించి అన్నట్లుగా బస్సు టికెట్లతో సహా జేబులో రూపాయి లేకుండా ఊరంతా తిరిగే సౌకర్యం కల్పిస్తామంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ ఫ్రీ పథకాలు ఏ మేర భారమవుతాయన్నది ఎవరూ చూడటం లేదు.
ఎన్నికలకు ముందుగా రాజకీయ పార్టీల నుంచి మరెన్ని వింత హామీలు వస్తాయోనని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీల పోటీ ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో బస్సులో ప్రయాణించినందుకు జై కొట్టడమే కాకుండా, బస్సు ఎక్కినందుకు ప్రయాణికులకు రివర్స్ లో డబ్బులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న సైటైర్లు పడుతున్నాయి. తమిళనాడు తర్వాత ఆ హామీలు తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తాయి.
