తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికలతో పాటు గోవా ఉపఎన్నికలకు ఆయన్ని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఆయన ఒకరిగా ఎదుగుతున్నారు. రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున గళం విప్పే స్థాయికి ఎదిగారు.
గతంలో 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయన కేరళలో విస్తృతంగా పర్యటించి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వాయనాడ్‌తో పాటు తిరువనంతపురంలో శశి థరూర్ తరపున ప్రచారం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడటానికి రేవంత్ శైలి ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా పంపారు. ముంబై వంటి నగరాల్లో ఉన్న తెలుగు వారి ఓట్లను రాబట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
గోవా ఉపఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ బాధ్యతను ఇచ్చారు. చిన్న రాష్ట్రమైనా, బీజేపీ ఢీకొట్టడంలో రేవంత్ అనుసరించే వ్యూహాలు అక్కడ ఫలిస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. రాష్ట్ర పరిపాలనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం చేసే ట్రబుల్ షూటర్‌గా రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను సుస్థిరం చేసుకుంటున్నారు.


