మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటన ఇప్పుడు రాజకీయంగా కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఈ వివాదంలోకి లాగుతూ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రమాదానికి గురైన విమాన సంస్థ వీఎస్ఆర్ వెంచర్స్ యజమాని రోహిత్ సింగ్‌కు టీడీపీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది రాజస్థాన్‌లో జరిగిన రోహిత్ సింగ్ కుమారుడి వివాహానికి ఒక టీడీపీ అగ్రనేత హాజరయ్యారని, అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీకి చెందిన వారే కావడంతో ఈ ప్రమాదంపై విచారణ నిష్పాక్షికంగా జరగదని ఆయన ఆరోపించారు. విచారణ పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడును మంత్రి పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అజిత్ పవార్‌కు సన్నిహితుడైన యజమాని
హిత్ పవార్ చేస్తున్న ఆరోపణల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని ఆయన విస్మరించినట్లు కనిపిస్తోంది. సదరు విమానయాన సంస్థ యజమాని రోహిత్ సింగ్, దశాబ్ద కాలంగా అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు. అజిత్ పవార్ తన రాజకీయ పర్యటనల కోసం ఏళ్ల తరబడి ఈ కంపెనీ విమానాలనే వాడుతున్నారు. అజిత్ పవార్‌కు అంతటి ఆప్తుడైన వ్యక్తికి చెందిన విమానం విషయంలో.. ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న టీడీపీ నేతలకు సంబంధం అంటగట్టడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. రోహిత్ పవార్, అజిత్ పవార్‌కు బంధువే అయినప్పటికీ, ప్రస్తుతం ఆయన శరద్ పవార్ నేతృత్వంలోని ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు. ఈ రాజకీయ వైరం వల్లే ఆయన ఇలాంటి వింత ఆరోపణలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
టీడీపీని టార్గెట్ చేయడం వెనుక మర్మం
విమాన ప్రమాద దర్యాప్తును కేంద్ర ఏవియేషన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోని ఏఏఐబీ నిర్వహిస్తోంది. కేవలం ఒక వివాహానికి వెళ్లినంత మాత్రాన లేదా ఒకే పార్టీకి చెందిన మంత్రి ఉన్నంత మాత్రాన దర్యాప్తు ప్రభావితం అవుతుందని అనడం నమ్మశక్యంగా లేదు. రోహిత్ పవార్ తన ఆరోపణల్లో ఎక్కడా టీడీపీ నేతలు కుట్ర చేశారని నేరుగా చెప్పలేదు కానీ, విచారణ సరిగ్గా జరగదని మాత్రం నొక్కి చెబుతున్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంపై, మిత్రపక్షమైన టీడీపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగానే కనిపిస్తోంది.
వైసీపీ నేతల అదనపు ప్రచారం
మహారాష్ట్రలో జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్ పవార్ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని, అజిత్ పవార్ మరణం వెనుక ఏదో పెద్ద కుట్ర దాగి ఉందన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సంబంధం లేని రెండు అంశాలను కలిపి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఒక విషాదకర విమాన ప్రమాదాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి రాజకీయ రొంపిలోకి లాగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
