ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న తన హామీని నిలబెట్టుకుంటూ, ఉగాది పండుగ పురస్కరించుకుని కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసేందుకు మంత్రి నారా లోకేష్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులతో పాటు కొత్తగా గుర్తించిన ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ సిద్ధమైంది. లోకేష్ తీసుకుంటున్న ఈ చొరవ నిరుద్యోగ యువతలో కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.
ఉగాదికి 3,600 పైచిలుకు టీచర్ పోస్టులు
పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలను సేకరించింది. తాజా సమాచారం ప్రకారం.. సుమారు 3,600 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ పాఠశాలల్లో 1,700 పోస్టులు, ఆదర్శ , సంక్షేమ పాఠశాలల్లో 1,200 పోస్టులు, అలాగే 700 వరకు ప్రత్యేక విద్య పోస్టులు ఉన్నాయి. ఈసారి అభ్యర్థులపై అదనపు భారం పడకుండా సిలబస్ , పరీక్షా విధానంలో ఎటువంటి మార్పులు చేయడం లేదని, పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామని లోకేష్ స్పష్టం చేయడం అభ్యర్థులకు పెద్ద ఊరటనిస్తోంది.
లక్షల ఉద్యోగాలే లక్ష్యం
కేవలం డీఎస్సీకే పరిమితం కాకుండా, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి సమగ్ర జాబ్ క్యాలెండర్ ను కూడా ఉగాది రోజే లోకేష్ ప్రకటించనున్నారు. యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి తోడు రాష్ట్రంలోకి వస్తున్న భారీ పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి లభించేలా ఏఐ ఆధారిత నైపుణ్య పోర్టల్ ను కూడా ప్రారంభించబోతున్నారు.
భరోసానిస్తున్న లోకేష్ విజన్
నిరుద్యోగుల సమస్యలను నేరుగా వింటూ, వారి అర్హతలకు తగ్గట్టుగా అవకాశాలు కల్పించడంలో నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడమే కాకుండా, ఇప్పుడు భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని నిరుద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఐటీ హబ్‌ల ఏర్పాటు, మరోవైపు ప్రభుత్వ కొలువుల జాతరతో ఏపీ యువతకు లోకేష్ ఒక నిజమైన ఆశాకిరణంగా మారుతున్నారు. ఉగాది నుంచి రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలుకానుండటంతో అభ్యర్థులు తమ సన్నద్ధతను వేగవంతం చేస్తున్నారు.


