సోగ్గాడే చిన్ని నాయిన, బంగార్రాజు సినిమాలు విజయవంతం అవ్వడంతో… వాటికి కొనసాగింపుగా మరో సినిమా చేయాలని అన్నపూర్ణ స్టూడియోస్ ఫిక్సయ్యింది. 2027లో సంక్రాంతికి సోగ్గాడే సీక్వెల్ తో వస్తామంటూ ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ మేరకు ఓ కథ రెడీ చేసి నాగార్జునకు వినిపించేశారు. సోగ్గాడేలో నాగ్ ఒక్కడే హీరో. బంగార్రాజులో నాగార్జునతో పాటుగా నాగచైతన్య కూడా కనిపించారు. అయితే ఈసారి నాగ్, చైతూతో పాటుగా అఖిల్ కూడా మెరిసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అఖిల్ ని కూడా సీక్వెల్ లో తీసుకోండి అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో సలహాలు గుప్పిస్తున్నారు. మరోవైపు అఖిల్ కూడా ఉన్నాడంటూ మరో వర్గం.. ఇప్పటి నుంచే ఫ్యాన్ మేడ్ పోస్టర్లని రెడీ చేసుకొనే పనిలో పడింది.
‘మనం’లో అక్కినేని హీరోలంతా కలిసి సందడి చేశారు. అయితే ఆ తరవాత వాళ్లని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం ముగ్గురు హీరోలకు సరిపడా కథని కల్యాణ్ కృష్ణ సిద్ధం చేశారని తెలుస్తోంది. అఖిల్ కూడా ఇలాంటి ఓ కుటుంబ కథా చిత్రంలో కనిపించాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. నాగ్ 100వ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లిపోయింది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ‘సోగ్గాడే’ సీక్వెల్ మే లేదా జూన్లో పట్టాలెక్కే ఛాన్సుంది. నవంబరు కల్లా తొలి కాపీ సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. ‘బంగార్రాజు’ కూడా ఇలానే ఏడాది చివర్లో మొదలెట్టి సంక్రాంతికి రెడీ చేశారు. పండగ సీజన్ ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. ఈసారి కూడా అంతే వేగంగా సినిమా పూర్తి చేస్తారు.

