డిసెంబర్ 20న అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు

అట్టడుగు నుంచి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న అక్కినేని జీవితం అందరికీ ఆదర్శప్రాయం. కృషి, పట్టుదల, అంకిత భావం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ కల వ్యక్తులు ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారో? చెప్పడానికి అక్కినేని ఓ ఉదాహరణ. ఆయన ఆశయాలకు అనుగుణంగా వివిధ రంగాలలో ప్రముఖులకు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు తోటకూర ప్రసాద్. ఈనెల (డిసెంబర్) 20న హైదరాబాదులో ద్వితీయ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రధానం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వివరాలు వెల్లడించడానికి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ.. “అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికాను 2014లో స్థాపించాం. గతేడాది డిసెంబర్ నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారు జన్మించిన గుడివాడలో మొదటి అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలను ప్రధానం చేశాం. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదులో అభివృద్ధికి అక్కినేని గారు విశేష కృషి చేశారు. ఆయనతో ఎంతో అనుబంధం గల భాగ్యనగరంలో ఈ సంవత్సరం పురస్కారాలను అందిస్తున్నాం. వివిధ రంగాల్లో ప్రముఖులు కలసి పనిచేసినపుడే మంచి సమాజం ఏర్పడుతుందని అక్కినేని అనేవారు. అందువల్ల, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమయాలు – పరిష్కారాలు అనే అంశం మీద లఘు చిత్రాల పోటీ(షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్) నిర్వహించాం. తనికెళ్ల భరణి ఆధ్వర్యంలో శేఖర్ కమ్ముల, ఎల్బీ శ్రీరాం, అవసరాల శ్రీనివాస్, ప్రవీణ్ సత్తారుల కమిటీ ముగ్గురు విజేతలను ఎంపిక చేసింది. 20న వారికి నగదు బహుమతి అందిస్తున్నాం. అక్కినేని గోల్డెన్ హీరోయిన్ల పేరుతో ఆయనతో పనిచేసిన కృష్ణవేణి, విజయ నిర్మల, జమున, జయప్రద, జయసుధలకు పురస్కారాలు ఇవ్వనున్నాం. నవరత్నాలు పేరుతో సమాజంలో తొమ్మిది రంగాల్లో ప్రముఖులను పురస్కారాలతో సత్కరించనున్నాం” అన్నారు.

రవి కొండబోలు మాట్లాడుతూ.. “1995 నుంచి అక్కినేనితో పరిచయం, మంచి స్నేహం ఉంది. అమెరికా వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన 89వ పుట్టినరోజును ఘనంగా జరిపాం. అమెరికాలో అన్ని నగరాలూ తిరిగి ఎంతో సంతోషించారు. 2016లో చెన్నైలో పురస్కార వేడుకలను నిర్వహిస్తాము..”అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దామా భక్తవత్సలం, శారదా ఆకునూరి, వంశీ రామరాజులు అక్కినేని గురించి, అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల గురించి మాట్లాడారు.

ఈ సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు అందుకోనున్న నవరత్నాలు :
జీవిత సాఫల్య పురస్కారం : నటశేఖర ఘట్టమనేని కృష్ణ
విశిష్ట వ్యాపార రత్న : ఏవిఆర్ చౌదరి
సినీరత్న : కైకాల సత్యనారాయణ
రంగస్థల రత్న : కర్నాటి లక్ష్మీనరసయ్య
విద్యారత్న : చుక్కా రామయ్య
వైద్యరత్న : డాక్టర్ గుళ్ల సుర్యప్రకాష్
సేవారత్న : డాక్టర్ సునీతా కృష్ణన్
యువరత్న : కుమారి పూర్ణ మాలవత్
చేనేత కళారత్న : నల్లా విజయ్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com