డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని .. హైకోర్టు చెప్పింది. అయితే హత్య జరిగినప్పుడు పోలీసులు కనీస ప్రాథమిక విచారణ కూడా చేయలేదని తాజాగా వెలుగులోకి వస్తోంది. తానే హత్య చేశానని మీడియాలో అన్ని వివరాలు బహిర్గతమైన తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. అప్పట్లో అతని ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కోర్టుకు సమర్పించారు. కానీ అసలు కాల్ లిస్టు కూడా పరిశీలించలేదని తాజాగా వెల్లడి అయింది.
సాధారణంగా ఓ నేరం జరిగితే జరిగితే పోలీసులు ముందుగా అతను ఎవరికి కాల్ చేశాడు.. ఆ తర్వాత ఎవరికి కాల్ చేశాడు అన్నది ఆరా తీస్తారు. అప్పుడు ఆ నేరంలో భాగస్వామ్యం అయిన వారు.. అలాగే.. హత్యకు కారణాలు వెల్లడి అవుతాయి. కానీ అనంత బాబు వ్యవహారంలో పోలీసులు అసలు దర్యాప్తే చేయలేదు. ఆయన చెప్పింది రాసుకుని అదే విచారణ అనుకోవాలన్నట్లుగా వ్యవహరించారు.
ఇప్పుడు అసలు దర్యాప్తు చేయాలని.. అనంతబాబు ఫోన్ ను పరిశీలించేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును పరిశీలిస్తోది. హత్య జరిగిన తర్వాత పోలీసులు చేసిన దర్యాప్తు ఏమిటి అని సిట్ అధికారులు పరిశీలిస్తే.. అసలు చేసిందేమీ లేదని క్లారిటీకి వచ్చారు. అనంతబాబు భార్యకు కూడా నోటీసులు ఇచ్చి.. ప్రశ్నించే అవకాశం ఉంది. అనంతబాబు తీవ్రమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తి కావడంతో అతని ఫోన్ పరిశీలిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు.