అల్లరి నరేష్ ని సడన్ స్టార్ గా మార్చిన చిత్రం సుడిగాడు. నరేష్ కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్. పాపం ఆ తరవాతే సరైన సినిమా లేకుండా పోయింది. అల్లరోడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్ లైన్ కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నరేష్ కి ఓ హిట్ పడాల్సిందే. అందుకే సుడిగాడు తో సూపర్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాసరావు నే నమ్ముకున్నాడు. చిత్రంగా సుడిగాడు తరవాత భీమనేని కి కూడా హిట్ లేదు. బెల్లం కొండ శ్రీనివాస్ తో చేసిన స్పీడున్నోడు తుస్ మంది. ఆ తరవాత భీమనేని కూడా మరో ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడు ఆయన కూడా నరేష్ నే నమ్ముకున్నాడు.
నరేష్ – భీమనేని కాంబోలో మరో సినిమా రాబోతొంది. నరేష్ కోసం ఈ దర్శకుడు రెండు, మూడు కధలు సిద్ధం చేశాడట. ఒకవేళ ఆ కధలు నచ్చని పక్షంలో తనకు అచ్చొచ్చిన రీమేక్ దారిలో వెళ్దాం అనుకుంటున్నాడు. భీమనేని రీమేక్ స్పెషలిస్ట్ అనే సంగతి తెలిసిందే. నరేష్ కి సరిపడా కథ ఏ భాషలో ఉందో అన్వేషిస్తున్నారాయన. నరేష్ – అనీష్ కృష్ణ కాంబోలో ఓ సినిమా త్వరలో పట్టాలెక్కబోతొంది. ఆ తరవాత భీమనేని సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం నరేష్ నటిస్తున్న జి. నాగేశ్వర రెడ్డి చిత్రం.. ఇంట్లో దయ్యం – నాకేం భయం ఈ దసరాకి విడుదల కాబోతొంది.