ఈవీవీ తనయుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న అరుదైన అవకాశం నరేష్‌కి దొరికింది. ‘నరేష్’ అంటే కామెడీ బ్రాండ్ పండింది. కెరీర్ బిగినింగ్‌లో ఆయన చేసిన కామెడీ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. కానీ నరేష్‌కి విభిన్నమైన సినిమాలు చేయాలనే తపన మొదటి నుంచి ఉంది. ప్రాణం, నేను, విశాఖ ఎక్స్‌ప్రెస్ అలా చేసినవే. కాకపోతే ఆ జానర్ సినిమాలకు అప్పట్లో అంత ఆదరణ ఉండేది కాదు. అందరూ ఆయన్ని కామెడీ సినిమాలు చేయమని ప్రోత్సహించారు. దీంతో ట్రెండ్‌తో సంబంధం లేకుండా మోనోటనీ వచ్చే వరకూ కామెడీ సినిమాలే చేస్తూ వెళ్లారు. ఒక దశలో సినిమా ఫ్లాప్ అవుతున్నా కామెడీ దారిని వదల్లేదు. ఇదే తన కెరీర్లో చేసిన తప్పని రియలైజ్ అయ్యారు నరేష్.
‘నా కెరీర్ బిగినింగ్‌లో అల్లరి సినిమా చేశాను. అది కామెడీ ముద్ర వేసింది. నిజానికి కేవలం కామెడీ సినిమాలు చేయాలని లేదు. కానీ నేను చేసిన ప్రాణం, నేను అప్పటికి అడ్వాన్స్డ్ జానర్ చిత్రాలు. ఆ సినిమాల ఫలితాలు నన్ను మళ్లీ కామెడీ ట్రాక్ వైపు నడిపాయి. కానీ మధ్యలో ట్రెండ్ మారింది. ప్రేక్షకులు విభిన్న సినిమాలకు అలవాటు పడ్డారు. కానీ నేను కేవలం కామెడీ సినిమాలే చేస్తూ వెళ్లాను. సుడిగాడు తర్వాత కొన్ని కామెడీ సినిమాలు చేశాను. కానీ అప్పుడే జానర్ మార్చాల్సింది. కానీ మహర్షి తర్వాత నాలో మార్పు వచ్చింది. నాంది తర్వాత మరో దారి దొరికింది. ఇప్పుడు సీరియస్‌తో పాటు కామెడీ సినిమాలు చేసేలా కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నాను’ అని చెప్పారు
నరేష్ తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో నటించిన 12A రైల్వే కాలనీ 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు నరేష్. ఒక కొత్తరకం స్క్రీన్‌ప్లేతో వస్తున్న సినిమా ఖచ్చితంగా ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుందని అన్నారు. ఈ సినిమా తర్వాత తను చేయబోయే రెండు సినిమాలు కూడా కామెడీ జానర్లో ఉంటాయి.

