అసెంబ్లీ ఫర్నీచర్‌నూ కోడెల వదిలి పెట్టలేదట..!

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన చుట్టూ ఫర్నీచర్ వివాదం అలుముకుంది. అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్‌ను.. ఆయన తన ఇంటికి తరలించారు. ఆ విషయం తాజాగా బయటపడింది. గతంలో.. హైదరాబాద్ నుంచి … అసెంబ్లీని ఏపీకి తరలిస్తున్నప్పుడు.. కొంత ఫర్నీచర్.. సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి తరలించారు. అప్పుడు ఆయన స్పీకర్ కాబట్టి… ఏ నిర్ణయం అయినా ఆయన చెప్పిన ప్రకారమే తీసుకుంటారు. ఆయన ఆదేశాల ప్రకారం… కొంత ఫర్నీచర్ ను.. అధికారులు ఆయన ఇంటికి తరలించారు. అప్పట్లో ఆ విషయం గుసగుసలకే పరిమితమయింది. ఓడిపోయిన తర్వాత ఆయన ఫర్నీచర్ ను.. అసెంబ్లీకి అప్పగిస్తే.. ఇబ్బంది ఉండేది కాదు.. కానీ ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్ గా ఉండటంతో.. వైసీపీ దీన్ని అందిపుచ్చుకుంది.

ఆ పార్టీ నేతలు… అసెంబ్లీ ఫర్నీచర్ కనిపించడం లేదని.. కోడెలను మరింత పక్కాగా ఇరికించేందుకు.. ప్రస్తుత స్పీకర్ తమ్మినేనికే ఫిర్యాదు చేశారు. దాంతో.. కోడెల.. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్.. తన ఇంట్లోనే ఉందని.. అనేక సార్లు తీసుకెళ్లమని లేఖలు రాసినా స్పందించలేదని… కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కోడెల శివప్రసాద్ పై .. వైసీపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని.. కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలతోనే తేలిపోతోంది. ఇలాంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన కోడెల కూడా.. తరచూ.. వైసీపీ టార్గెట్ కు దొరికిపోతున్నారు.

కే ట్యాక్స్ పేరుతో ఇప్పటికే… కోడెల కుటుంబంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు.. ఫర్నీచర్ వివాదంతో.. కోడెల ఇమేజ్ మరింత డ్యామేజ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా.. తీసుకోకపోయినా… దీని కేంద్రం చేసే ప్రచారంతో… కోడెల ఇబ్బంది పడక తప్పదనే అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com