‘సైరా’ టీజ‌ర్‌: చ‌రిత్ర మ‌ర్చిపోయిన యోధుడి క‌థ‌

బాహుబ‌లితో తెలుగు సినిమా హ‌ద్దులు చెరిగిపోయాయి. ఎంతైనా ఖ‌ర్చు పెట్టు – రాబ‌డికి మార్గం ఉంద‌ని బాహుబ‌లి నిరూపించింది. ఆ దారిలోనే, ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే సాహో, సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. భారీద‌నంలోనూ, విజువ‌ల్ గ్రాండిటీలోనూ పోటీ ప‌డుతున్నాయి. తెలుగు సినిమా చూస్తున్నామా? అంత‌ర్జాయ‌తీ సినిమా చూస్తున్నామా? అనే అంద‌మైన భ్రాంతిని క‌లిగిస్తున్నాయి. ఇప్పుడు `సైరా` టీజ‌ర్ చూసినా అదే భావ‌న‌.

తొలి భార‌త స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని ‘సైరా’గా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరు 151వ చిత్ర‌మిది. దాదాపుగా 250 కోట్ల‌తో త‌యార‌వుతోంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంతా పేరెన్న‌ద‌గిన‌వాళ్లే. వీళ్లంతా దాదాపు రెండేళ్లుగా శ్ర‌మించి త‌యారు చేసిన ‘సైరా’ ఎలా ఉంటుందో అని ప్ర‌తీ తెలుగు అభిమానీ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అంచ‌నాల్ని పెంచుతూ ‘సైరా’ టీజ‌ర్‌ని ఓ మెరుపులా వ‌దిలారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వాయిస్ ఓవ‌ర్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది. చ‌రిత్ర భ‌గ‌త్‌సింగ్‌, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ లాంటి ఎంతోమంది వీరుల్ని గుర్తుపెట్టుకుంద‌ని, చ‌రిత్ర కూడా మ‌ర్చిపోయిన వీరుడు సైరా న‌ర‌సింహారెడ్డి అంటూ ఉపోద్ఘాత‌మిచ్చాడు ప‌వ‌న్‌. `చ‌రిత్ర‌లో మ‌నం ఉండ‌క‌పోవొచ్చు. కానీ ఇక నుంచి చరిత్ర మ‌న‌తో మొద‌ల‌వ్వాలి` అంటూ.. `సైరా` దృక్ప‌థాన్ని వ‌ల్లించాడు చిరంజీవి. విజువ‌ల్స్ అంత‌ర్జాతీయ స్థాయిలో క‌నిపించాయి. యుద్ధాలు, సైన్యం, దాడులు.. ఇవ‌న్నీ భారీ స్థాయిలో చూపించిన వైనం క‌నిపిస్తుంది. న‌ర‌సింహారెడ్డి గాల్లో దూకుతూ.. ఇద్ద‌రు శ‌త్రువుల్ని నేల‌నేసి కొట్టే షాట్‌… క‌న్నుల పండుగ‌లా ఉంది. అమితాబ్‌, న‌య‌న‌, త‌మ‌న్నా, విజ‌య్ సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్ వీళ్లంతా ఒక్కో షాట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అభిమానులు ఏమైతే ఆశిస్తున్నారో, చిత్ర సీమ దేన్న‌యితే తెర‌పై చూడాల‌నుకుంటుందో అలాంటి సినిమానే `సైరా` బృందం తీసింద‌న్న న‌మ్మ‌కం క‌లుగుతోంది. ఈ న‌మ్మ‌కాలు ఏ మేర‌కు నిజం అవుతాయో తెలియాలంటే అక్టోబ‌రు 2 వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.