ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రష్యా దారికి రాకపోయినా ఉక్రెయిన్ ను దారికి తెచ్చేందుకు ఆయన బెదిరింపులకూ పాల్పడుతున్నారు. చివరికి తాము ఒప్పందానికి దగ్గరగా వచ్చాం అన్న ఆయన ప్రకటన చేసిన తర్వాత రోజే.. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. అవి నిజమో కాదో కానీ రష్యానే వాటిని ప్రకటించింది.
పుతిన్‌ను టార్గెట్ చేస్తే రష్యా ఊరుకుంటుందా?
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని, అయితే తమ రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేశాయని రష్యా ప్రకటించింది. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయిేత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి , కీవ్‌లోని ప్రభుత్వ భవనాలపై రష్యా భారీ దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్న ఓ కారణం అని అంటున్నారు. కానీ పుతిన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడికీ చెప్పారు.
ట్రంప్ ప్రయత్నాలపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఆరోపణలు ఒక పెద్ద అడ్డంకిగా మారాయి. పుతిన్ స్వయంగా ట్రంప్‌కు ఫోన్ చేసి ఈ దాడి గురించి చెప్పడంతో, ట్రంప్ తొలుత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది శాంతి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన మండిపడ్డారు. అయితే, ట్రంప్ ఈ విషయాన్ని విచారిస్తామని చెబుతూనే, శాంతి ఒప్పందం 95 శాతం పూర్తయిందని, త్వరలోనే ముగింపు వస్తుందనే ఆశాభావాన్ని ఇంకా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ నిజంగా దాడులు జరిగి ఉంటే.. ట్రంప్ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
రష్యానే గేమ్ ఆడుతోందా ?
డ్రోన్ దాడులు చేసినందున చర్చల వైఖరిని మరింత కఠినతరం చేస్తామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ మరింత భూభాగాన్ని వదులుకోవాలని లేదా రష్యా కోరుకున్న కఠిన షరతులకు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. నిజానికి రష్యా తరపున ట్రంపే మాట్లాడుతున్నారని అనుకోవాలి. తమపై దాడి జరిగిందని చెప్పడం ద్వారా అంతర్జాతీయంగా సానుభూతి పొందడం మరియు భవిష్యత్తులో ఉక్రెయిన్‌పై చేసే తీవ్ర దాడులను సమర్థించుకోవడం రష్యా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వద్ద నుంచి కొన్ని భూభాగాలు పొందాలని పుతిన్ ప్లాన్ చేస్తున్నారు. వాటిని అప్పగిస్తే తప్ప శాంతి ఒప్పందం సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. 2026లోనూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నాన్ స్టాప్ గా కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


