రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా ఉంటే అన్నింటికీ కారణం అయిపోతారు. తెలంగాణలో ఆ సెంటర్ పాయింట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎక్కడ ఏం జరిగినా ఆయనే కారణం అని అన్నిపార్టీల నేతలు లింకులు పెట్టి రాజకీయాలు చేసేస్తున్నారు. తాజాగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై చాటభారతం చెప్పారు. ఆయనకు అంత తీరిక ఎక్కడ ఉందో కానీ.. అంతా అయిపోయాక.. రేవంత్ రెడ్డికి లింక్ పెట్టారు. ఇక్కడ విచిత్ర రాజకీయం అయిపోయింది.
బీఆర్ఎస్ లో హరీష్ రావు, కవిత ఉక్కపోతకు గురవుతున్నారని వారు బయటకు వస్తారని.. హరీష్ రావు ప్రతిపక్ష నేతగా..కవిత మండలి పక్ష నేతగా ఉంటారని జోస్యం చెప్పారు. ఇలా అవ్వాలంటే రేవంత్ సహకారం కావాలని.. ఆయన సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. రేవంత్ సహకారం తీసుకుని పార్టీని చీల్చుకుని హరీష్ , కవిత ఏం సాధిస్తారో మహేశ్వర్ రెడ్డి కాస్త లాజికల్ గా చెప్పాల్సింది. కానీ బయట మీడియాలో ఇలా జరుగుతోంది.. సోషల్ మీడియాలో అలా చెప్పుకుంటున్నారని విషయాలన్నీ చెప్పారు.
రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ చీల్చేందుకు అవకాశం వచ్చినా చీలుస్తారో లేదో కానీ…ఆయన సహకారం తీసుకునేంత పిచ్చి పని హరీష్ రావు, కవిత మాత్రం చేయరు. ఆ మాత్రం రాజకీయ జ్ఞానం వారికి ఉంటుంది. కానీ ఏదో జరిగిపోతుందని.. దానికి రేవంత్ రెడ్డే బాధ్యుడని చెప్పడానికి మహేశ్వర్ రెడ్డి చాలా క్రియేటివిటీ వినియోగించుకున్నారు.