అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర నాయుడు ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈటీవీ విన్ రూపొందించిన ‘గుర్తుకొస్తున్నాయ్’ సిరీస్‌కి ఆయన నిర్మాత. విరాజ్ హీరోగా నటించారు. వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఈ వేసవిలో ఈటీవీ విన్ లో ఈ సిరీస్ చూడొచ్చు. టీజర్ కూడా ఈ రోజే విడుదలైంది. చిన నాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకొనే అరుదైన అనుభూతుల మాల ఇది. టీజర్లో ఇచ్చిన వాయిస్ ఓవర్, ట్రంకు పెట్టె నిండా దాచుకొన్న భావోద్వేగాలు.. ఈ ప్రయత్నం అందరి మనసుల్ని గెలుచుకోబోతోందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.
జర్నలిస్టుగా తన ప్రయాణం ప్రారంభించిన శరత్.. ఆ తరవాత ఇండస్ట్రీలోకి వచ్చారు. కొన్నేళ్లుగా బన్నీ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు `రేలంగి మావయ్య` అనే ఓ వెబ్ పేజీ నిర్వహిస్తున్నారు. అందులో ఆయన పంచుకొనే క్రియేటీవ్ ఆలోచనలు నచ్చి, ఈటీవీ విన్ ఆయన్ని అప్రోచ్ అయ్యింది. అలా… ఈ కథ పుట్టుకొచ్చింది. ‘గుర్తుకొస్తున్నాయ్’ టీజర్లోనూ బన్నీకి సంబంధించిన కొన్ని రిఫరెన్సులు కనిపించాయి. ‘దేశముదురు’, ‘ఆర్య’ గ్రీటింగ్ కార్డ్స్ ని ఈ టీజర్లో చూపించారు. సినిమాలో కూడా బన్నీ రిఫరెన్సులు ఉంటాయనడంలో సందేహం లేదు. అలా.. శరత్ చంద్ర బన్నీపై తనకున్న ప్రేమని మరోసారి చాటుకొన్నారు. హీరోల మేనేజర్లు నిర్మాతలుగా మారడం టాలీవుడ్ లో సాధారణమే. కాకపోతే.. విజయాలు అందుకోవడమే కాస్త కష్టం. మరి.. శరత్ చంద్ర ఏం చేస్తారో?
