అల్లు శిరీష్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికి 8 సినిమాలు చేశాడు. ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’… ఓకే ఓకే అనిపించుకొన్నాయి. ష్యూర్ షాట్ హిట్ ఒక్కటీ పడలేదు. బయటి హీరోలకు హిట్లు ఇచ్చి, వాళ్ల కెరీర్‌ని టర్న్ చేసిన అల్లు అరవింద్ సైతం తనయుడు శిరీష్ ని గట్టెక్కించలేకపోతున్నారు. గతేడాది శిరీష్ నుంచి వచ్చిన `బడ్డీ` సైతం తడబడింది. ఇప్పుడు శిరీష్ కచ్చితంగా ఓ హిట్ కొట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఓ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం.
వరుస ఒడుదుడుకులు నేర్పిన పాఠమో, ఏమో… ఈసారి సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకొన్నాడట. యాక్షన్ జోలికి పోకుండా పూర్తిగా ఫన్ డ్రైవ్ గా సాగే ఓ స్క్రిప్టు ఓకే చేశాడు. బచ్చలమల్లి ఫేమ్ సుబ్బు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాతో సుబ్బు దర్శకుడిగా రంగ ప్రవేశం చేశాడు. ‘బచ్చలమల్లి’పై చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కానీ ఆ సినిమా ఆడలేదు. ఇప్పుడు ఓ మంచి కామెడీ టచ్ ఉన్న కథ రాసుకొన్నాడని, స్క్రిప్టు పర్ఫెక్ట్ గా కుదిరిందని, ఏ హీరో చేసినా.. మినిమం గ్యారెంటీ ఉంటుందని తెలుస్తోంది. ‘సామజవరగమన’ లాంటి టచ్‌తో.. ఈ కథ నడుస్తుందని, రైటింగ్ టీమ్ కూడా స్ట్రాంగ్ గా ఉందని, ఫన్ వర్కవుట్ అయితే… హిట్టు గ్యారెంటీ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ నమ్మకంతోనే శిరీష్ ఈ స్క్రిప్టుని ఓకే చేశాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది.