సినిమా బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం, అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తి కాకపోవడమే. పెరిగిపోయే పని దినాలే ప్రొడక్షన్ ఖర్చును అమాంతం పెంచేస్తాయి. ఎంత ప్లాన్ చేసినా, అనుభవం ఉన్న దర్శకులు ఉన్నా కూడా చాలా సార్లు ఓవర్బడ్జెట్కు ఇదే ప్రధాన కారణం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ అందరికీ షాక్ ఇచ్చింది. కేవలం 24 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేసింది.
వరలక్ష్మి తొలిసారి మెగాఫోన్ పట్టుకుని చేసిన సినిమా ‘సరస్వతి’. ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, చెల్లాయి పూజతో కలిసి నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకుంది. ఓ కొత్త దర్శకురాలిగా కేవలం 24 రోజుల్లో సినిమా పూర్తి చేయడం విశేషమే. అలాగని ఇది హడావిడిగా చుట్టేసిన సినిమాలా కనిపించడం లేదు. ప్రియమణి, ప్రకాష్ రాజ్, నాజర్, రాధిక, రావు రమేష్ వంటి పెద్ద తారాగణం ఉంది. తమన్ సంగీతం అందించాడు.
ట్రైలర్‌ను కూడా థ్రిల్లింగ్‌గా కట్ చేశారు. గీత ఆర్ట్స్ విడుదలకు ముందుకు రావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. వరలక్ష్మికి ఉన్న ఫేమ్ కారణంగా అన్నీ సకాలంలో సమకూరి ఉండవచ్చు. కాకపోతే మూడు వారాల వ్యవధిలో సినిమా పూర్తి చేయడం, అదీ ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌గా అంటే.. వరలక్ష్మి స్పీడ్‌ను మెచ్చుకోవాల్సిందే. మార్చి6న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది.
