అమరావతిలో ఏం జరుగుతోంది అనేది ఇతర ప్రాంతాల్లో ఉండే వారికి చాలా మందికి క్యూరియాసిటీ. ఎందుకంటే అసలేం జరగడం లేదని చెప్పేవారు ఉన్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో రాత్రింబవళ్లు వీడియోలు తీసి ప్రజలకు చెప్పే యూట్యూబర్లు ఉన్నారు. ఎక్కడో కూర్చుని ఏం జరగడం లేదని వీరు చెప్పరు. నేరుగా సైట్ కు వెళ్లి ఏం జరుగుతుందో.. చూపిస్తున్నారు. ఇలాంటి వారి వీడియోలను జనం ఆసక్తిగా చూస్తున్నారు. అమరావతిలో ఏం జరుగుతుందో.. అంచనా వేస్తున్నారు.
అమరావతిలో 24/7 పనులు
ఏపీ రాజధానికి ఓ రూపం తీసుకు వచ్చేందుకు .. నిరంతరం పనులు జరుగుతున్నాయి. పనులు చేయడమే పండుగ అన్నట్లుగా అక్కడ కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అమరావతిలో పన్నెండు వేల మందికిపైగా మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ప్రతి సైట్ లోనూ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పనులు జరుగుతున్నాయి. ఇంజినీర్లు.. కార్మికులు ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అందుకే ఈ రోజు ఉన్నట్లుగా రేపు కనిపించడం లేదు. ఎంతో కొంత విజిబుల్ అభివృద్ధి కనిపిస్తోంది.
నిర్మాణ పనుల్లో అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ
కాంట్రాక్టులు పొందిన సంస్థలన్నీ దిగ్గజ సంస్థలే. అందరూ పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను విదేశాల నుంచి తీసుకు వచ్చారు. పనులు వేగంగా సాగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వారికి పక్కా డెడ్ లైన్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన సమయం ప్రకారం పనులు జరగాల్సిందేనని నిర్దేశించిది. రాజధాని అంటే.. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ అనుకునేవారి కోసం.. ఆ కోరికను తీర్చేందుకు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఖచ్చితంగా మరో ఏడాదిన్నరలో వాటికో రూపం వస్తుంది.
ప్రజల ముందు ఉంచుతున్న యూట్యూబర్లు
ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుందో ప్రతి రోజూ య్యూట్యూబర్లు చూపిస్తున్నారు. డ్రోన్లు వాడి.. మరీ ప్రజలకు అసలు నిజాలు చూపిస్తున్నారు. ఆంధ్రుల రాజధానికి ఓ రూపం వస్తోందని ఫేక్ ప్రచారాలు అమ్మాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు. ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అంటే… అమరావతిలో ఏం జరగడం లేదు అనే ప్రచారానికి చెక్ పడినట్లే అనుకోవచ్చు.