ప్రజాధనంతో సొంత వ్యాపారాలు జగన్ శైలి – మజ్జిగ ప్యాకెట్ కూడా ప్రభుత్వానికి అమ్మని నైతికత చంద్రబాబు కుటుంబానిది. అయినా ఇప్పుడు జరుగుతున్నది వేరు. చంద్రబాబు తన కంపెనీ నెయ్యిని టీటీడీకి అమ్మేసుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ బరి తెగింపు రాజకీయం ప్రజల్ని కూడా నివ్వెర పరుస్తుంది.
ప్రభుత్వ టెండర్లకు టీడీపీ ఫ్యామిలీ దూరం
నందమూరి, నారా కుటుంబాలు దశాబ్దాలుగా ఒక స్పష్టమైన పాలసీని పాటిస్తూ వస్తున్నాయి. ఎన్టీఆర్ కాలం నుండి నేటి వరకు ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వం నుండి నేరుగా ఎలాంటి వ్యాపార లబ్ధిని పొందలేదనే పేరుంది. చంద్రబాబు నాయుడు స్థాపించిన హెరిటేజ్ సంస్థ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ అయినప్పటికీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ సంస్థ ఎప్పుడూ ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదు. కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు ఒక మజ్జిగ ప్యాకెట్ సరఫరా చేసే చిన్న కాంట్రాక్టును కూడా తీసుకోకపోవడం వారి నైతిక విలువలకు నిదర్శనం.
జగన్ రెడ్డి హయాంలో అధికారిక లబ్ధి
చంద్రబాబు కుటుంబంపై బురద చల్లాలని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన వ్యక్తిగత సంస్థల ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించారు. తన పత్రికకు వందల కోట్ల ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం, వాలంటీర్ల ద్వారా ఆ పత్రికను బలవంతంగా కొనిపించడం, ప్రభుత్వ నిర్మాణ పనులకు తన సిమెంట్ కంపెనీల నుండే సరఫరా జరిగేలా చూడటం వంటివి ఆయన హయాంలో బహిరంగ రహస్యాలు. చివరికి తన సొంత కంపెనీకి అక్రమంగా గనుల లీజులు కూడా కేటాయించుకున్నారు. ఇలా అధికార దుర్వినియోగం చేస్తూ సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా సాగే క్విడ్ ప్రో కో సంస్కృతికి జగన్ ఆద్యుడు. ఇదంతా బహిరంగమే.
కానీ ఎదుటి వారిపై బురద చల్లేందుకు తెగింపు
హెరిటేజ్ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి అనైతిక వ్యాపార సంబంధాలు లేకపోయినా, కేవలం ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు జగన్ బృందం ప్రయత్నిస్తోంది. చేయాలనుకుంటే జగన్ మాదిరిగా నేరుగా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారానే హెరిటేజ్ ఉత్పత్తులను సరఫరా చేసే అవకాశం ఉన్నా, చంద్రబాబు అలాంటి పనులకు ఎప్పుడూ చేయలేదు. ఆధారాలు లేకపోయినా బురద చల్లేసి తుడుచుకోమనే తరహాలో సాగుతున్న వైసీపీ రాజకీయం రాష్ట్రంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. విలువలు పాటించే నాయకుడికి, విలువలనే వ్యాపారంగా మార్చుకున్న నాయకుడికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తూనే ఉంటారు తీర్పు చెప్పాల్సిన సమయంలో చెబుతారు.


