ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు విజయవాడలో జరగనుంది. ఈ మూడు రోజుల మెగా ఎక్స్పో గృహ కొనుగోలుదారులు, డెవలపర్లు, ఆర్థిక సంస్థలు, హోమ్ ఇంప్రూవ్మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ల కోసం ఒక వేదికగా ఉంటుంది.
60కి పైగా స్టాళ్లు, ప్రముఖ డెవలపర్లు, బ్యాంకులు, ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్లు ఇందులో పాల్గొ అంటున్నాయి. ఈ ఫెస్టివల్‌ను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగస్టు 30, 2025న న్యూఢిల్లీలో జరిగిన నారెడ్కో 17వ జాతీయ సమావేశంలో ఈ ఫెస్టివల్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆయన అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రభుత్వ విజన్‌ను హైలైట్ చేశారు.
ఈ ఫెస్టివల్ గృహ కొనుగోలుదారులకు పారదర్శకమైన, సమగ్రమైన వేదికను అందిస్తుంది. విశ్వసనీయ డెవలపర్లు, ఆన్-ది-స్పాట్ ఆర్థిక సహాయం, ఇంటీరియర్ సొల్యూషన్లను ఒకే చోట అందుబాటులో ఉంచుతారు. ఈ ఈవెంట్ ద్వారా కొనుగోలుదారులకు ప్రత్యేక రాయితీలు, లేఅవుట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించిన వాస్తవ సమాచారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. “రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు – నాలా చట్టం రద్దు, నిర్మాణ నిబంధనల సడలింపు, త్వరిత ప్రాజెక్టు ఆమోదాలు – రియల్ ఎస్టేట్ రంగాన్ని బలోపేతం చేశాయి. ఇది పెట్టుబడులకు అనువైన సమయం,” అని రియల్ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఫెస్టివల్ కేవలం రెసిడెన్షియల్ , కమర్షియల్ ప్రాజెక్టులను ప్రదర్శించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్, ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ విధానాలను హైలైట్ చేస్తుంది. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే అవకాశాన్ని కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అందరికీ ప్రవేశం ఉచితం.