అమరావతిని ప్రపంచ టెక్నాలజీ పటంలో నిలబెడుతూ దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీకి రాజధాని వేదికైంది. ఉద్దండరాయునిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఘనంగా ఈ వ్యాలీకి శంకుస్థాపన చేశారు. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానమైన క్వాంటం కంప్యూటింగ్ రంగానికి అమరావతిని కేంద్రీకృతం చేస్తూ, బోస్టన్, సింగపూర్ , షాంఘై వంటి ప్రపంచ స్థాయి నగరాల సరసన రాజధానిని నిలబెట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో, 8.5 మిలియన్ చదరపు అడుగుల భారీ నిర్మాణంతో ఈ వ్యాలీ రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా 48, 29 అంతస్తులతో 8 భారీ టవర్లను ఎల్అండ్టీ సంస్థ నిర్మించనుంది. అలాగే రెండు ఎకరాల్లో ప్రత్యేకంగా నిర్మించే క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనంలో IBM సంస్థ క్వాంటం కంప్యూటర్లను తయారు చేయనుండగా, ప్రముఖ ఐటీ దిగ్గజం TCS సాఫ్ట్వేర్ సేవలను అందించనుంది. ఈ కేంద్రం ద్వారా 133 క్యూబిట్ సామర్థ్యం కలిగిన క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోయడమే కాకుండా వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి క్వాంటం వ్యాలీ ప్రారంభం కానుంది . డిసెంబర్ నాటికి క్వాంటం కంప్యూటర్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లను ఎగుమతి చేసే గ్లోబల్ హబ్‌గా అమరావతి ఎదగనుంది.
