రాజధాని ట్విస్ట్ :శాసన మండలి అధికారాలు, ఉనికి పై మళ్లీ చర్చ

Sri Shariff Mohammed Ahmed
Sri Shariff Mohammed Ahmed

ఆంధ్రప్రదేశ్ రాజధాని ని అమరావతి నుండి వీలైనంత త్వరగా విశాఖపట్నం తరలించాలన్న జగన్ తాపత్రయం మీద శాసనమండలి గట్టి దెబ్బ కొట్టింది. శాసనసభ లో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ, శాసనమండలిలో బలం లేకపోవడం, దాని కంటే ముఖ్యంగా శాసనమండలి చైర్మన్ తెలుగుదేశం పార్టీ హయాంలో నియమింపబడిన వ్యక్తి కావడం అధికారపార్టీకి ఝలక్ తగలడానికి ప్రధాన కారణం అయింది. అయితే ఈ సందర్భంలో అసలు శాసనసభ అధికారులు ఎంత వరకు ఉంటాయి, అధికార పార్టీ ఉన్న శాసనసభలో పాస్ అయిన బిల్లు ని శాసనమండలి ఎంత వరకు అడ్డుకోగలుగుతుంది, శాసన మండలిని రద్దు చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటే దాని ఉనికి ఎంత వరకు ఉంటుంది అనే అంశాలపై చర్చ మొదలైంది.

సీఆర్డిఎ బిల్లు 3 నెలలు పెండింగ్ లోకి వెళ్లేలా చేసిన మండలి చైర్మన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని లెజిస్లేటివ్ రాజధానిగా ఉంచుతూ, విశాఖపట్నం ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారుస్తూ, కర్నూలుని జుడిషియల్ రాజధానిగా మార్చడానికి ప్రవేశపెట్టిన సిఆర్డిఎ బిల్ అసెంబ్లీలో పాస్ అయి, శాసన మండలికి వచ్చింది. అయితే శాసన మండలి చైర్మన్ ఓటింగ్ నిర్వహించకుండా సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు నెలల వరకు ఈ బిల్లు వాయిదా పడ్డట్టు అయింది. ఒకవేళ ఓటింగ్ జరిగి ఉంటే, శాసనమండలిలో బిల్లు నెగ్గినా, నెగ్గక పోయినా దాన్ని పట్టించుకోకుండా నెల రోజుల్లోపే అసెంబ్లీ బిల్లు పాస్ చేయించుకుని గవర్నర్ తో ఆమోద ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నించి ఉండేది. అయితే, శాసన మండలి తో పోలిస్తే శాసన సభకు ఉన్న విస్తృత అధికారాల దృష్ట్యా, మూడు లేదా నాలుగు నెలల తర్వాత అయినా అధికార పార్టీ ఈ బిల్లును పాస్ చేయగలుగుతుంది.

శాసన మండలి అధికారాలు నామమాత్రమే:

శాసన మండలి అనేది ఒక రాష్ట్రంలో ఉండాలా వద్దా అన్నది ఆ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది. ఇప్పటికీ మనదేశంలో చాలా రాష్ట్రాలలో శాసనమండలి లేదు. అయితే శాసనమండలి ఉన్న రాష్ట్రాలలో, అసెంబ్లీలో పాస్ అయిన ప్రతి బిల్లు శాసన మండలికి పంపవలసి ఉంటుంది. అదేవిధంగా కొన్ని సార్లు బిల్లు శాసన మండలే ముందుగా పాస్ చేసి వాటిని అసెంబ్లీకి కూడా పంపే అవకాశం ఉంటుంది. కానీ బిల్లు శాసన సభ నుండి శాసన మండలికి వచ్చిన సందర్భంలోనూ, శాసన మండలి లో మొదలై శాసన సభకు వెళ్లిన సందర్భంలోనూ శాసన మండలి అధికారాలు మాత్రం నామమాత్రమే.

శాసన మండలి ఏ బిల్లు అయినా గరిష్టంగా నాలుగు నెలలు ఆపగలుగుతుంది:

శాసనసభ బిల్లు పాస్ చేసి, దానిని శాసనమండలికి పంపితే, మండలి ఆ బిల్లుని తిరస్కరించినా, లేక ఏ నిర్ణయం తీసుకోకుండా మూడు నెలలపాటు కాలయాపన చేసినా, అసెంబ్లీ కి, రెండవసారి అదే బిల్లును మళ్లీ శాసన మండలికి పంపే అధికారం ఉంటుంది. రెండవసారి గనక అసెంబ్లీ శాసనమండలి కి బిల్లు పంపినట్లయితే , అప్పుడు మండలి నెల రోజుల లోపల తన నిర్ణయాన్ని తెలుపవలసి ఉంటుంది. నెలరోజుల లోపు శాసనమండలి బిల్లును ఆమోదించినా, తిరస్కరించినా, ఏ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసినా, బిల్లు పాస్ అయినట్లే. అసెంబ్లీ ఆ బిల్లుని గవర్నర్ కి పంపి ఆమోదముద్ర వేయించుకుని, ఆ బిల్లుని శాసనంగా మారుస్తుంది. అంటే మొదటిసారి బిల్లు వచ్చినప్పుడు మూడు నెలలు, రెండవసారి బిల్లు వచ్చినప్పుడు ఒక నెల, ఇలా మొత్తం కలిపి నాలుగు నెలల పాటు మాత్రమే శాసన మండలి బిల్లును ఆపగలుగుతుంది. ఇప్పుడు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ పేరిట చేసే కాలయాపన కూడా మూడు నెలలకు మించడానికి వీల్లేదు. ఏప్రిల్ 20వ తేదీ వరకు శాసన మండలి తన నిర్ణయాన్ని తెలుపకపోతే, అసెంబ్లీ రెండవసారి ఈ బిల్లుని శాసన మండలికి ఏప్రిల్ 20 అనంతరం పంపించవచ్చు. అసెంబ్లీ శాసన మండలికి రెండోసారి బిల్లును పంపిన రోజు నుండి శాసన మండలికి ఒక నెల గడువు ఉంటుంది.

లోక్సభ విషయంలో రాజ్యసభకు ఉన్నపాటి అధికారాలు కూడా, అసెంబ్లీ విషయంలో మండలికి ఉండవు:

నిజానికి పార్లమెంటులో కూడా ఇలాగే లోక్సభ, రాజ్యసభ అంటూ రెండు సభలు ఉన్నప్పటికీ, రాజ్యసభకు శాసనమండలి కంటే కాస్త ఎక్కువ అధికారాలు ఉంటాయి. లోక్ సభ బిల్లు పాస్ చేసి రాజ్యసభకు బిల్లు పంపించినప్పుడు, రాజ్యసభ ఆ బిల్లుని ఆమోదించక పోయినా, ఆరు నెలల వరకు నిర్ణయం తీసుకోకపోయినా, ఉభయ సభలను కలిపి ఒక జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. అందులో బిల్లు పాస్ అయితే సరి, లేదంటే ఆ బిల్లు ఎప్పటికీ చట్టంగా మారదు. ఒకవేళ బిల్లు రాజ్యసభలో మొదలై, లోక్ సభలో ఆమోదింపబడక పోయినప్పుడు కూడా ఇదే తరహా జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. కానీ శాసన మండలి విషయంలో బిల్లు ఎక్కడ మొదలైనా కూడా జాయింట్ సిట్టింగ్ అనే అవకాశమే లేదు.

అయితే పైన చెప్పుకున్న దంతా సాధారణ బిల్లుల సంగతి. సాధారణ బిల్లు కాకుండా, ద్రవ్య బిల్లుల విషయంలో మాత్రం రాజ్యసభకు కూడా పరిమితమైన అధికారాలే ఉంటాయి. అచ్చం శాసనమండలికి శాసనసభ విషయంలో ఉన్నట్లుగానే అన్నమాట.

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి చరిత్ర:

ఆంధ్రప్రదేశ్లో 1958 వరకు శాసనమండలి లేదు. అప్పటి మద్రాస్ రాష్ట్రం లో, ఇప్పటి తమిళనాడులో కూడా శాసనమండలి అనేదే లేదు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత శాసన మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో 1958 నాటికి అది ఏర్పాటయింది. రాజ్యసభ వలనే ఇది కూడా నిరంతరం ఉండే సభ. అసెంబ్లీ, లోక్ సభ ల మాదిరిగా ఐదేళ్లకొకసారి రద్దు అవ్వదు. ఈ కారణంగా, ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ఎక్కువగా ఈ సభలో ఉంటారు. 1983 లో ఎన్టీఆర్ అధికారం చేపట్టే నాటికి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులతో నిండిన శాసనమండలిని రద్దు చేయడానికి ఆయన చేసిన సిఫారసుతో ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి 1985లో రద్దు అయింది. మళ్లీ 2004లో వైయస్సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో 2007లో శాసన మండలి ఏర్పాటైంది.

శాసన మండలి ఉనికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉందా?

శాసనమండలి ఉండాలా లేదా అనేది ఆ రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే అధికార పార్టీకి మెజారిటీ ఉండే అసెంబ్లీ శాసన మండలి రద్దు చేయాలి అనుకుంటే, ఆ మేరకు శాసనసభలో మెజారిటీ తో తీర్మానాన్ని పాస్ చేసి, కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుని శాసనమండలిని రద్దు చేయవచ్చు. అయితే, రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం మీద కాకుండా పార్లమెంటు మీద ఉన్న కారణంగా, సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న సమయంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టడం కొన్నిసార్లు కష్టమవుతుంది. అలాంటి సందర్భాలలో అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పటికీ, శాసన మండలి రద్దు కావడం కష్టతరమవుతుంది ( శాసన మండలి రద్దు ఇష్టం లేని పార్టీలు పార్లమెంట్ లో మిగతా పార్టీల మద్దతు కూడగట్టినట్లయితే).

ఒకవేళ జగన్ గనక శాసన మండలి రద్దు చేయాలని అనుకుంటే 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న కారణంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం సునాయాసమే. కానీ ఆ తర్వాత బంతి పార్లమెంట్ కోర్టులో పడుతుంది. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది పూర్తిగా పార్లమెంటు ఆధీనంలో ఉంటుంది.

– జురాన్ ( @CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com