ఓ వైపు అంబటిని కాపు మహా నేత అని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తూంటే అంబటి రాంబాబు మాత్రం తన కూతుళ్లను కాపులకు ఇచ్చి పెళ్లి చేయలేదని కమ్మ వర్గానికి ఇచ్చి పెళ్లి చేశానని చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఓదార్పు పొందారు. ఆ తర్వాతమీడియాతో మాట్లాడారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తనకు 24 గంటల్లో సినిమా చూపిస్తానని అన్నారని, అన్నట్లుగానే 18 రోజుల పాటు జైల్లో ఉంచి నిజంగానే సినిమా చూపించారని అన్నారు. అయితే, ఇంత పెద్ద సినిమాలో అసలు హీరో ఎవరు అని అంబటి ప్రశ్నించారు. వైసీపీ నేతలు చేసిన పరామర్శలతో అంబటి తానే హీరో అని ఫీలవుతున్నారు.
తనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి అధికారులు రిమాండ్ రిపోర్టులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు అంశాలను చేర్చారని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. తాను అనని మాటలను కూడా అన్నట్లుగా చిత్రీకరించారని.. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా విమర్శిస్తే, దానిని కమ్మ సామాజిక వర్గాన్ని దూషించినట్లుగా రిపోర్టులో పొందుపరచారని చెప్పుకొచ్చారు. కుట్ర పూరితంగా రెచ్చగొట్టడానికి చంద్రబాబును ఆయన తల్లిని అత్యంత ఘోరంగా తిట్టిన ఆయన దాన్ని రాజకీయ విమర్శ అని చెప్పుకుంటున్నారు.
కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తిని తాను కాదని నిరూపించుకోవడానికి అంబటి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. తన కుటుంబంలోని ఎనిమిది మంది సభ్యులలో ఇద్దరు అల్లుళ్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారేనని ఆయన వెల్లడించారు. నా అల్లుళ్లు ఇద్దరు అదే సామాజిక వర్గం వారైనప్పుడు, నేను ఆ కులాన్ని ఎలా దూషిస్తాను అని అమాయకత్వం నటించారు. కానీ అంబటి రాంబాబును కాపు నేతగా వైసీపీ రుద్దేసిందన్న సంగతి ఆయనకు ఇంకా తెలిసి వచ్చినట్లుగా లేదు.
