అంబటి రాంబాబుకు సంబంధించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న సుమారు 22 ఎకరాల భారీ ఫామ్ హౌస్‌ను సర్వే చేయాలని అధికారులు నిర్ణయించి, ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ ఫామ్ హౌస్‌లో నిబంధనలకు విరుద్ధంగా విలాసవంతమైన భవనంతో పాటు స్విమ్మింగ్ పూల్‌ను కూడా నిర్మించారని అందిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. అయితే, ఈ సర్వేను అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపడుతూ.. తాను లీగల్‌గానే ఆ భూములు కొనుగోలు చేశానని అంటున్నారు. ఆయన లీగల్ గా కొనుగోలు చేశారా.. ఇల్లీగల్ గా కొనుగోలు చేశారా అన్నదానపై సర్వే చేయడం లేదు. కానీ ఆయన భుజాలు తడుముకుంటున్నారు.
అంబటి రాంబాబు సొంత ప్రాంతం రేపల్లె కాగా, ఐదేళ్ల పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోనే ఇక్కడ భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత ఊరు రేపల్లెలో కూడా లేని స్థాయిలో, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఇన్ని ఎకరాల భూమిని ఎలా సంపాదించారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం కావాలనే తన ఆస్తులపై పడుతోందని అంబటి విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, ఆస్తులన్నీ చట్టబద్ధంగా సంపాదించినవే అయితే సర్వేకు ఆయన ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నారో అర్ధం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం అధికారులు ఈ 22 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారం, అక్కడ జరిగిన నిర్మాణాల అనుమతులపై లోతైన విచారణ జరుపుతున్నారు. తన మీద రాజకీయ కక్ష సాధింపు జరుగుతోందని అంబటి మొత్తుకుంటున్నప్పటికీ ఆ భూముల లెక్కేమిటో అధికారులు బయటకు తీస్తారు. ఒకవేళ అంతా సక్రమంగానే ఉంటే భయపడాల్సిన అవసరం లేదని, కానీ అంబటి వ్యవహారశైలి చూస్తుంటే ఏదో తప్పు జరిగిందనే అనుమానం కలుగుతోంది. పైగా తాను మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పి వచ్చారట.