ఓ ముఖ్యమంత్రిని ఆయన తల్లిని అత్యంత ఘోరంగా దూషించి.. అరెస్టు చేస్తారా చేసుకోండి అని సవాల్ చేస్తున్నారు అంబటి రాంబాబు. వైసీపీ నాయకత్వం మనస్తత్వం ఇదే. ప్రభుత్వం గీత దాటదని.. తనపై దాడి చేయుకండా కాచుకుంటుందని ఆయన నమ్మకం. ఒక వేళ అరెస్టు చేస్తే మరింతగా రెచ్చిపోవచ్చని వ్యూహం.
గతంలో జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఒక టీడీపీ కార్యకర్తను అప్పట్లో ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. సామాన్యుడికి ఒక చట్టం, మాజీ మంత్రికి మరో చట్టం ఉండని.. అంబటి రాంబాబుకు అలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేనని సామాన్య జనం డిమాండ్ చేస్తున్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి కుటుంబంపై, మరణించిన వారి తల్లిదండ్రులపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమే కాకుండా, సమాజంలో అలజడి సృష్టించే కుట్రగా భావించాల్సి ఉంటుంది.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీని ఇరుకున పెట్టింది. ఈ అంశంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే అంబటి రాంబాబు వంటి నేతలు ఇలాంటి బూతుల అస్త్రాన్ని బయటకు తీసినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి, వారు దాడులకు దిగితే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి అసలు చర్చను నీరుగార్చవచ్చన్నది వైసీపీ ప్లాన్ . తమపై దాడులు జరిగినా పర్వాలేదు కానీ, చర్చ మాత్రం తమ తప్పుల మీద కాకుండా వ్యక్తిగత దూషణల మీద సాగాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది.
రాజకీయాలను బూతులమయం చేస్తున్న నేతలకు చట్టపరంగా తగిన ట్రీట్ మెంట్ ఇవ్వకపోతే, భవిష్యత్తులో ఈ సంప్రదాయం మరింత బరితెగించే ప్రమాదం ఉంది. ఏపీ రాజకీయాల్లో ఒకప్పటి హుందాతనాన్ని కాపాడాలంటే, ఇలాంటి నేరపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
