రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ హిట్ అనేది పక్కన పెడితే – రామ్ చరణ్‌లోని నటుడ్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. ‘రంగస్థలం’ కంటే ‘ఆర్.ఆర్.ఆర్’ పెద్ద హిట్ అయినా.. ఇప్పటికీ ‘రంగస్థలం’ అంటేనే చరణ్ ఫ్యాన్స్ కి ఇష్టం. అందుకే చరణ్ – సుకుమార్ కాంబో మళ్లీ రిపీట్ అయితే చూడాలన్నది అభిమానుల ఆశ.
ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతోంది. `పెద్ది ` అవ్వగానే.. చరణ్ – సుక్కుల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఇప్పటి వరకూ సుకుమర్ చరణ్‌కు కథేం చెప్పలేదన్న గుసగుసలు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. సుకుమార్ కథ ఎప్పుడు చెబుతాడు? సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే బెంగ ఫ్యాన్స్ లో ఉంది. నిజానికి సుకుమార్ చరణ్‌కు కథ చెప్పేశాడు. ఆ కథ చరణ్‌కీ నచ్చింది. కాకపోతే ఇక్కడే ట్విస్టు. చరణ్ కి చెప్పిన కథ పక్కన పెట్టి, సుకుమార్ మరో కథని సైతం రెడీ చేస్తున్నాడట. మొదట చెప్పిన కథ కంటే, ఈ కథ ఇంకా బాగా కుదిరిందని టాక్. కాకపోతే.. చరణ్‌కి ఈ రెండో కథ వినిపించలేదు. ‘పెద్ది’ పనులన్నీ అయిపోయిన తరవాత రెండో కథేమిటన్నది చరణ్‌కి తెలుస్తుంది. ఈలోగా పూర్తి స్థాయిలో ఆ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్.
‘రంగస్థలం’ సినిమా సమయంలోనూ అంతే. మొదట రామ్ చరణ్‌కి వేరే కథ వినిపించాడు సుకుమార్. ఆ తరవాత జరిగిన ప్రోసెస్ లో ‘రంగస్థలం’ కథ పుట్టింది. అది చరణ్‌కి బాగా నచ్చింది. ఈసారీ.. అదే జరగబోతోంది. కాకపోతే ఈ రెండు కథల్లో ఏది చేయాలి అనేది పూర్తిగా చరణ్ ఇష్టం.
