వైసీపీలో ప్రస్తుతం కాపు సామాజిక వర్గ రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు తర్వాత పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఆయనకే చిరాకు తెప్పిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రిని ఘోరంగా బూతులు తిట్టి జైలుకు వెళ్లిన అంబటిని కాపుల మహానేత గా చిత్రీకరించేందుకు వైసీపీ అధిష్టానం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగానే రాజమండ్రి జైలుకు, అంబటి నివాసానికి వరుసగా కాపు నేతలను పంపేలా పక్కా షెడ్యూల్ రూపొందించడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
రాజకీయంగా బలి చేస్తున్నారని అంబటి అనుమానం
జగన్ రెడ్డి తనను రాజకీయ అవసరాల కోసం బలి పశువును చేస్తున్నారనే భావన అంబటిలో బలంగా ఉన్నట్లు ప్రచారంజరుగుతోంది. ఈ రాజకీయ హడావుడి మధ్య మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అంబటిని కలిసేందుకు వెళ్లిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు చేదు అనుభవం ఎదురైంది. అమర్నాథ్ అతిగా మాట్లాడుతున్నారని భావించారో ఏమో కానీ, అంబటి ఆయనతో ములాఖత్ అయ్యేందుకు నిరాకరించారు. ఆరోగ్యం బాగోలేదనే సాకుతో ఆయనను వెనక్కి పంపేసి, ఆ తర్వాత వచ్చిన ఇతర నేతలను కలవడం అమర్నాథ్ వర్గానికి తలవంపులుగా మారింది. పార్టీలో తనకంటే జూనియర్ అయిన అమర్నాథ్ తన విషయంలో చూపిస్తున్న అతి ఉత్సాహంపై అంబటి అసహనంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పార్టీ నేతల్లో అసంతృప్తి.. సాక్షి ప్రచారంపై ప్రశ్నలు!
అంబటి రాంబాబును అగ్రనేతగా మార్చే ప్రయత్నాలపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీఎంను తిట్టి జైలుకు వెళ్లడమే ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లుగా, పార్టీ సొంత మీడియా సాక్షి మొత్తం సమయాన్ని ఆయనకే కేటాయించడంపై ఇతర నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం మేమూ కష్టపడుతున్నాం, కానీ మా వద్దకు వచ్చేసరికి ప్రతిదానికీ డబ్బులు వసూలు చేస్తారు.. అంబటి విషయంలో మాత్రం ఈ రేంజ్ ప్రచారమా? అంటూ కొందరు నేతలు లోలోన మధనపడుతున్నారు. అంబటిని కాపుల టైగర్‌గా ప్రొజెక్ట్ చేయడం వల్ల మిగిలిన కాపు నేతల ఉనికి ప్రమాదంలో పడుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. అంబటిని బాధితుడిగా చూపించి సామాజిక వర్గ ఓట్లను ఆకట్టుకోవాలని అధిష్టానం భావిస్తుంటే అది కొత్త రాజకీయాలకు కారణం అవుతోంది.
