రివ్యూ : అమీ – తుమీ

క‌న్‌ఫ్యూజ్ డ్రామా అనేది ఓ సెప‌రేట్ జోన‌ర్‌! అయితే వాటి చుట్టూ అల్లుకొనే క‌థ‌లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఒక‌రు అనుకొని మ‌రొక‌ర్ని ఇష్ట‌ప‌డ‌డం.. తాను క‌న్‌ఫ్యూజై.. అంద‌ర్నీ క‌న్‌ఫ్యూజ్ పెట్ట‌డం – ఇదీ వాటి ఫార్ములా. అయితే.. క‌న్‌ఫ్యూజ్ చేస్తూ.. వినోదం సృష్టించ‌డం అనుకొన్నంత తేలికైన విష‌యం కాదు. ఆ క‌న్‌ఫ్యూజ్ – కామెడీలో ఏది త‌గ్గినా, ఏది మ‌రోదాన్ని డామినేట్ చేసినా మొద‌టికే మోసం వ‌స్తుంది. అందుకే ఏదో అక్క‌డ‌క్క‌డ కామెడీ స‌న్నివేశాల‌కే ఈ సెగ్మెంట్‌ని వాడుకొంటుంటారు ద‌ర్శ‌కులు. సినిమా మొత్తం.. క‌న్‌ప్యూజన్ చుట్టూనే తిప్ప‌డం క‌ష్ట‌మైన విష‌యం. అమీ – తుమీ కోసం ఆ ఫీట్ చేశాడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. మ‌రి అందులో తాను విష‌యం సాధించాడా? ఈక‌న్‌ఫ్యూజ్ డ్రామాలో క‌న్‌ఫ్యూజ‌న్ ఎంత‌? వినోదం ఎంత‌? డ్రామా ఎంత‌??

*క‌థ‌

దీపిక (ఈషా) ఆనంద్ (అడ‌విశేష్‌)ని ప్రేమిస్తుంది. త‌న‌నే పెళ్లి చేసుకోవాల‌నుకొంటుంది. అయితే దీపిక తండ్రి (జ‌నార్థ‌న్‌) కి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. బాగా డ‌బ్బున్న శ్రీ‌చిలిపి (వెన్నెల కిషోర్‌)తో దీపిక పెళ్లి చేయాల‌ని డిసైడ్ అవుతాడు. దీపిక ని ఇంట్లో బంధించి… పెళ్లి చూపుల కోసం శ్రీ‌చిలిపిని ఇంటికి పిలిపిస్తాడు. ఈలోగా ప‌నిమ‌నిషి కుమారి (భార్గ‌వి) అండ‌తో ఆ ఇంట్లోంచి త‌ప్పించుకొంటుంది దీపిక‌. మ‌రోవైపు జ‌నార్థ‌న్ కొడుకు విజ‌య్.. మాయ (అదితి)ని ఇష్ట‌ప‌డతాడు. మాయ తండ్రికీ.. జ‌నార్థ‌న్‌కీ ఏవో పాత గొడ‌వ‌లు ఉంటాయి. పైగా మాయ ఇంట్లో స‌వ‌తి త‌ల్లిపోరు. ఇవ‌న్నీ భ‌రించ‌లేక ఇంట్లోంచి బ‌య‌ట‌కు వచ్చేస్తుంది మాయ‌. దీపిక ఆడే నాట‌కం వ‌ల్ల ప‌ని మ‌నిషి కుమారినే దీపిక అనుకొని.. త‌న మాయ‌లో ప‌డిపోతాడు చిలిపి. ఈ చిన్న క‌న్‌ఫ్యూజ‌న్ ఈ క‌థ‌ని ఎలాంటి మ‌లుపు తిప్పింది. చివ‌రికి ఏమైంది? అనేదే అమీ తుమీ క‌థ‌.

* విశ్లేష‌ణ‌

క‌థ‌గా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో క‌న్‌ఫ్యూజన్ త‌ప్ప ఏం లేదు. స‌రిగ్గా ఇలాంటి క‌థ‌లే.. కామెడీ ఎపిసోడ్లుగా చాలా సినిమాల్లో చూసేశాం. దాన్నే పూర్తి స్థాయి సినిమాగా మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం ఇంద్ర‌గంటి న‌మ్మింది.. క‌థ‌ని కాదు. అందులో చిలిపి అనే పాత్ర‌ని. ఆ పాత్ర‌ని ఎంత ఎలివేట్ చేయాలో అంతా చేశాడు. ఆ పాత్ర కోసం డైలాగులు ధార బోశాడు. స‌న్నివేశాలు ఎడా పెడా రాసుకొన్నాడు. చిలిపి పాత్ర‌ని ఇష్టంగా తీర్చిదిద్దాడు. దాంతో… మిగిలిన పాత్ర‌ల‌న్నీ సైడ్ అయిపోయి… చిలిపి పాత్రే హీరో అయిపోతుంది. `అమీ తుమీ`లోంచి చిలిపి అనే పాత్ర‌ని తీసి ప‌క్క‌న పెట్టండి. `అమీ తుమీ` ఓ నాన్సెన్స్‌లా క‌నిపిస్తుంది. దాన్ని బ‌ట్టి… చిలిపి పాత్ర ప్ర‌మేయం ఈ సినిమాలో ఎంత వ‌ర‌కూ ఉందో అర్థం చేసుకోవొచ్చు.

ఇదో క‌న్‌ఫ్యూజ‌న్ డ్రామా. అయితే క‌న్‌ఫ్యూజ‌న్ పుట్టించ‌డానికి ద‌ర్శ‌కుడు చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు. త‌న కూతుర్ని ఓ రూమ్‌లో వేసి బంధించ‌డం, పెళ్లి కూతురు ఫొటో ఏంటో చూడకుండా చిలిపి పాత్ర పెళ్లి చూపులకు రావ‌డం, పెళ్లి చూపుల‌నే త‌తంగాన్ని ఆరు బ‌య‌ట హాలులో కాకుండా… ఓ రూమ్ లో అదీ.. క‌న్న తండ్రి త‌లుపు బ‌య‌ట నుంచుని పెళ్లి కొడుకుని లోప‌ల‌కు పంపించ‌డం.. ఇవ‌న్నీ.. ద‌ర్శ‌కుడు తన‌కు తాను తీసుకొన్న ఫ్రీ హ్యాండ్‌. అంటే.. క‌న్‌ప్యూజ్ పుట్ట‌డానికి ఏం చేయాలో… అదంతా చేసేశాడు. ఇలాంటి సినిమాల‌కు లాజిక్కులు వేసుకోకూడ‌దు. కేవ‌లం ఫ‌న్ ఎంజాయ్ చేయాలి. అలా చేస్తే… అమీతుమీనీ ఎంజాయ్ చేసేయొచ్చు. పాత్ర‌ల ప‌రిచ‌యానికీ క‌థ‌లోకి వెళ్ల‌డానికి ద‌ర్శ‌కుడు టైమ్ తీసుకొంటాడు. అయితే.. అక్క‌డ‌క్క‌డా కామెడీ వ‌ర్క‌వుట్ అవ్వ‌డంతో.. కాస్త బ‌ద్ద‌కంగానైనా క‌థ‌లోకి ఎంట‌ర్ అయిపోతాడు ప్రేక్ష‌కుడు. ఎప్పుడైతే చిలిపి పాత్ర ఎంట‌ర్ అయ్యిందో అప్ప‌టి నుంచీ.. ఈ క‌థ స్టిరింగ్ మొత్తం ఆ పాత్ర చేతికి అప్ప‌గించేశాడు. వెన్నెల కిషోర్ ఆ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డం. ఆ బాడీ లాంగ్వేజ్, డైలాగుల్ని ప‌లికిన విధానం.. ఇవ‌న్నీ బాగా ర‌క్తిక‌ట్ట‌డంతో.. మైన‌స్సులు కూడా ప్ల‌స్సులుగా క‌నిపిస్తుంటాయి. కుమారి – చిలిపి మ‌ధ్య తొలి సీన్ అయితే… థియేట‌ర్లో న‌వ్వులు కురిపించ‌డం ఖాయం. వెన్నెల కిషోర్ ఎక్క‌డైతే క‌నిపించ‌డో.. అక్క‌డ సినిమా విసుగు అనిపిస్తుంటుంది. ప‌తాక స‌న్నివేశాలు కూడా అంతంత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌లో రెండే పాట‌ల‌కు చొటిచ్చాడు. పాట‌లతో నిడివి పెంచే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం శుభ సూచికం.

* న‌టీన‌టులు

ఈ సినిమాకి హీరోలు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, అడ‌విశేష్ అని చెప్పుకొన్నా, వాళ్ల పేర్లే ముందు ప‌డినా, పోస్ట‌ర్ల‌లో వాళ్ల ఫొటోలే ఎక్కువ‌గా క‌నిపించినా…. ఈ సినిమాకి అస‌లు సిస‌లు హీరో వెన్నెల కిషోర్ మాత్ర‌మే. అవ‌స‌రాల‌, అడ‌విశేష్‌ల‌వి కేవ‌లం గెస్ట్ అప్పీరియ‌న్స్‌లు అనుకోవాలి. చిలిపి పాత్ర ఎప్పుడైతే ఎంట‌ర్ అవుతుందో… అప్పుడు మాయ‌మైన హీరోలు క్లైమాక్స్‌కి గానీ తేల‌రు. దాన్ని బ‌ట్టి… ఈ సినిమాలో హీరో ఎవరో అర్థం చేసుకోవొచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ గురించి చెప్పుకొనేది ఏముంది?? చించేశాడు. ఇక అవ‌స‌రాల, అడ‌వి శేష్ కేవ‌లం స‌పోర్ట్ ఇచ్చారంతే. ఈషా ఓకే అనిపిస్తుంది. అదితి పాత్ర‌కూ అంత ప్రాముఖ్యం లేదు. త‌నికెళ్ల భ‌ర‌ణి లాంటి అనుభ‌వ‌జ్ఞుడు ఓవ‌రాక్ష‌న్ చేయ‌డం జీర్ణించుకోలేని విష‌యం. త‌న‌నే కాదు… దాదాపు ప్ర‌తీ పాత్రా ఎప్పుడో ఒక‌ప్పుడు ఓవ‌ర్ యాక్ష‌న్ లో త‌మ ప్ర‌తిభా ప్రావీణ్యం చూపిస్తూనే ఉంటాయి. భార్గ‌వి న‌ట‌న‌.. త‌న డైలాగులు త‌ప్ప‌కుండా న‌వ్వులు పంచుతాయి.

* సాంకేతిక వ‌ర్గం

ఇంద్ర‌గంటి `పెన్ను` మ‌హ‌త్యం బ‌య‌ట పెట్టిన సినిమా ఇది. అష్టాచ‌మ్మా త‌ర‌వాత‌.. అంత‌టి ఫ‌న్ ఈ సినిమాలోనే వినిపించింది. చాలా చిన్న డైలాగులు, త‌మాషా ప‌దాలు క‌నిపించాయి. `నిన్ను నిన్నుగానే ఇష్ట‌ప‌డ్డాను. న‌న్‌గా ఇష్ట‌ప‌డ‌లేను` లాంటి మాట‌లు వింటుంటే.. డైలాగులు ఇంత సింపుల్‌గా ఇంత ఈజీగా రాసేయొచ్చా అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ – భార్గ‌విల పెళ్లి చూపులు సీన్‌, షాపింగ్ మాల్ సీన్‌లో ర‌చ‌యిత‌గా ఇంద్ర‌గంటి ప‌వ‌ర్ బాగా తెలుస్తుంది. మణిశ‌ర్మ ప్ర‌తిభ చూపించే అవ‌కాశం రెండు పాట‌ల్లోనే ద‌క్కింది. నేప‌థ్య సంగీతం కూల్‌గా ఉంది. అతి త‌క్కువ లొకేష‌న్ల‌లో తీసిన సినిమా ఇది. బ‌డ్జెట్ కంట్రోల్ అడుగ‌డుగునా క‌నిపించింది.

మొత్తానికి `అమీ తుమీ` ఒక్క‌సారి స‌ర‌దాగా చూసొచ్చేసే సినిమా. కొంచెం రొమాన్స్ – కొంచెం క‌న్ ఫ్యూజ్ – కావ‌ల్సినంత `చిలిపి`ద‌నం.. ఇదీ.. అమీ తుమీ!

* ఫైన‌ల్ ట‌చ్ : అమీ తుమీ… ఇది మ‌హా `చిలిపి`

తెలుగు360.కామ్ రేటింగ్ 3/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.