సిఐడీ, సిబీఐల‌కు ఇంత‌కంటే ప‌నులేవీ లేవా?

రోడ్ల‌కు రోడ్లు కొట్టుకుపోతున్నాయి. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో విచ్చ‌ల‌విడిగా లంచావ‌తారాలు రాజ్య‌మేలుతున్నారు. అయినా ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుపోతోంది. తాత్కాలిక స‌చివాలయంలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గన్మోహ‌న్ రెడ్డి చాంబ‌ర్‌లో నీళ్ళొచ్చాయ‌ని క‌ల‌క‌లం. మూడు రోజులైన త‌ర‌గ‌ని అల‌జ‌డి. ప్ర‌తిప‌క్షాన్నీ లోప‌ల‌కు రానివ్వ‌రు. గౌర‌వ‌నీయ స్పీక‌రుగారు స్వ‌యంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎవ‌రో ఉద్దేశ‌పూర్వ‌కంగా పైపును కోయ‌డం వ‌ల్లే అలాగైంద‌నీ, ఆ కోసిందెవ‌రో తేల్చుకుని ఈ అంశానికి ముగింపు ప‌ల‌కాల‌నీ ప్ర‌భుత్వం నానా తంటాలు ప‌డుతోంద‌నే అంశం ఈ హ‌డావిడి కార‌ణంగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. 900 కోట్ల రూపాయ‌లు పెట్టి క‌ట్టిన స‌చివాల‌యంలో కెమెరాలు పెట్ట‌లేదా. ఫుటేజి మొత్తం చూస్తే తెలుస్తుందిగా ఎవ‌రీ ప‌నిచేశారో తెలియ‌డానికి. దీనికి సిఐడి విచార‌ణ అవ‌స‌ర‌మా? సిఐడీకి ఇంత‌కంటే ముఖ్య‌మైన నేరాలు లేవా ప‌రిశీలించ‌డానికి? కాల్ మనీ ఏమైంది? ముద‌్ర‌గ‌డ కేసేమైంది? పుష్క‌రాల్లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణేమైంది? ఇవి కొన్ని మాత్ర‌మే. ఇంకా చాలా ఉన్నాయి ఉద‌హ‌రించ‌డానికీ.. విమ‌ర్శించ‌డానికీ. వాటిని విడిచిపెట్టి.. జ‌గ‌న్ చాంబ‌ర్లో నీరెలా కారిందనేది పెద్ద స‌బ్జెక్టైపోయిందిప్పుడు.

కాప‌లావాళ్ళు చూసుకోవాల్సిన అంశానికి నేత‌లు ఇంకాస్త రంగు పులుముతున్నారు. జ‌గ‌న్‌కు లేని ప్ర‌చారాన్ని తెచ్చి పెడుతున్నారు. నీళ్ళొచ్చాయి కాబ‌ట్టి ఆ పార్టీ వాళ్ళు అనడం అంటారు. దానికి స‌మాధానం చెప్పాల్సింది పోయి.. బుర‌ద మీద వేసేసి, తుడుచుకోమ‌నే వైఖ‌రి స‌రైందేనా. ప్ర‌స్తుత వివాదాలు చూస్తుంటే ఒక అనుమానం రాక మాన‌దు. అస‌లు చంద్ర‌బాబుగారికి అన్ని విష‌యాలూ తెలుస్తున్నాయా అనే అనుమాన‌మొస్తోంది. అంత రాజ‌కీయానుభ‌వం ఉన్న నాయ‌కుడు ఇలా చేయిస్తున్నారంటే న‌మ్మ‌శ‌క్యంగా లేదు. వీళ్ళు సిఐడీ అంటే ప్ర‌తిప‌క్షం వాళ్ళు ఒక‌డుగు ముందుకేసి, సిబిఐ ఎంక్వ‌యిరీ కావాలంటారు. వ్య‌వ‌స్థ‌ల్ని కునారిల్ల‌చేయ‌డం కాక ఇంకేమిటి? ఒక గ‌దిలో నీరు కారితే, సిఐడీ, సీబీఐ వ‌చ్చి విచారించాలా? ఏమనుకుంటున్నారు ఆ సంస్థ‌ల గురించి? అవి వాటి ప‌ని మాని క‌న్నాలు ఎలా వేశారు? గొట్టాలు ఎవ‌రు కోశారు తేల్చాలా? ఇంత‌కంటే వారికేమీ ప‌నిలేదా? ఇంకాన‌యం సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తితో విచారింప‌జేయ‌మ‌ని కోర‌లేదు? ఇప్ప‌టికైనా ఈ వివాదానికి ముగింపు ప‌లికితే మేలు. లేక‌పోతే ఈ మేట‌ర్ ఆ నోటాఈనోటా జాతీయ స్థాయికి వెడితే ఎంత న‌గుబాటు? ఎవ‌డైనా పెట్టుబ‌డిదారుడు రాష్ట్రం వైపు చూస్తారా. చంద్రబాబు గారు రంగంలోకి దిగి అంద‌రి నోళ్ళూ మూయించాల్సిన స‌మ‌యం ఇది. నిర్మాణంలో త‌ప్పు జ‌రిగుంటే.. దాన్ని ఒప్పేసుకుంటే హుందాగా ఉంటుంది క‌దా? ఆలోచించండి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.