తమిళనాడులో అమిత్ షా పర్యటించారు. ఆ తర్వాత విజయ్ .. బీజేపీతో పొత్తులు పెట్టుకోక తప్పదని సంకేతాలు వచ్చాయి. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని విజయ్ చెబుతున్నా.. ఆయన కన్నా రాజకీయ చాణక్యం అమిత్ షాకు ఎక్కువే. ఆ విషయంపై ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న పొత్తుల చర్చలే నిరూపిస్తున్నాయి.
విజయ్ కలసి రావాల్సిందేనని అమిత్ షా సంకేతాలు
తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ రాజకీయాలకు చెక్ పెట్టాలని చూస్తున్న బీజేపీకి, విజయ్ రూపంలో ఒక బలమైన ఆకర్షణీయమైన శక్తి కనిపిస్తోంది. అమిత్ షా పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్డీయే కూటమిని విస్తరించాలని సూచించారు. విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా యువత ఓట్లను భారీగా కొల్లగొట్టవచ్చని, తద్వారా డీఎంకే పట్టున్న ప్రాంతాల్లో చొచ్చుకుపోవచ్చని బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
మెల్లగా మెత్తబడుతున్న విజయ్
విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తూ అటు బీజేపీని, ఇటు డీఎంకేను ఇద్దరినీ విమర్శించినప్పటికీ, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ అధిష్టానం విజయ్ టీంతో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే, విజయ్ తన పార్టీ స్వతంత్రతను కాపాడుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే, అది కేవలం సీట్ల సర్దుబాటు వరకే పరిమితమవుతుందా లేక అధికారం పంచుకునే స్థాయికి వెళ్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పొత్తు వల్ల విజయ్ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తుంది, కానీ తమిళనాడులోని ద్రవిడ సెంటిమెంట్ వల్ల మైనారిటీ , సెక్యులర్ ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్ ఇప్పటి వరకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కానీ, అమిత్ షా వ్యూహాలు ఎప్పుడూ అనూహ్యంగా ఉంటాయని చెబుతున్నారు.
రెండు కూటముల మధ్య పోరే
అమిత్ షా పర్యటన తమిళనాడులో పొత్తుల గందరగోళానికి తెర దించే దిశగా సాగిందని అనుకోవచ్చు. పొత్తులకు వస్తే విజయ్ నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యం ఉండదని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం ఈసారి విజయ్ను వదులుకోకూడదనే పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో ఢిల్లీ పెద్దలతో విజయ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఈ చర్చను మరింత బలపరుస్తున్నాయి. బీజేపీ ప్రేమిస్తే.. తాను ప్రేమించకుండా ఉండలేనన్న వాస్తవాన్ని విజయ్ త్వరగానే గ్రహించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
