రివ్యూ: అమృత రామ‌మ్‌

తెలుగు360 రేటింగ్‌: N/A

ప్రేమ.. రెండ‌క్ష‌రాలు.
పిచ్చి.. రెండ‌క్ష‌రాలు.
చావు.. రెండ‌క్ష‌రాలే. ప్రేమ పిచ్చి ముదిరితే.. చావులో కూడా ప్రేమే క‌నిపిస్తుంది. బ‌హుశా.. అమృత రామ‌మ్ క‌థ పుట్ట‌డానికి కార‌ణం ఈ పాయింటే కావొచ్చు. కొంత‌మంది ప్రేమ పొంద‌లేక చావుని కోరుకుంటారు. కానీ… అమృత రామం క‌థ మాత్రం ప్రేమ పొంద‌డానికే చావుని శ‌ర‌ణ్యం అనుకుంది. అదే ఈ సినిమా పాయింట్‌. థియేట‌ర్లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది.కాక‌పోతే.. లాక్ డౌన్ వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నేరుగా విడుద‌లైన తొలి సినిమా ఇదే కావ‌డంతో – ‘అమృత రామ‌మ్‌’పై ఫోక‌స్ ఏర్ప‌డింది. మ‌రి ఈ సినిమా ఎలా వుంది? ప్రేమ‌ని జ‌యించ‌డానికి మ‌ర‌ణాన్ని ఆహ్వానించిన ఈ ప్రేమ‌క‌థ ఎలా ఉంది?

క‌థ‌

రామ్ (రామ్ మిత్త‌కంటి) త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆస్ట్రేలియాలో ఉంటాడు. మిగిలిన వాళ్లంతా ఏదో ఓ ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తుంటే, రామ్ మాత్రం త‌న‌కు న‌చ్చిన ఉద్యోగం కోసం అన్వేషిస్తూ, కాల‌క్షేపం చేస్తుంటాడు. మాస్ట‌ర్ డిగ్రీ కోసం ఇండియా నుంచి ఆస్ట్రేలియాలో అడుగుపెడుతుంది అమృత (అమృతా రంగ‌నాథ్‌). తొలి చూపులోనే రామ్‌ని ఇష్ట‌ప‌డుతుంది. పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంది. రామ్ నుంచి ఒక్క క్ష‌ణం కూడా దూరంగా ఉండ‌లేదు. క్ర‌మంగా రామ్ కూడా అమృత‌కు ద‌గ్గ‌ర‌వుతాడు. కానీ.. అమృత మితిమీరిన ప్రేమ ఒక్కోసారి రామ్‌కి త‌ల‌నొప్పులు తెస్తుంటుంది. ఇద్ద‌రి మ‌ధ్యా దూరం పెరిగిపోతుంది. ఒకానొక స‌మ‌యంలో అమృత‌ని రామ్ అస‌హ్యించుకునే ప‌రిస్థితికి వెళ్లిపోతాడు. అయినా స‌రే… అమృత రామ్‌ని గాఢంగా ప్రేమిస్తూనే ఉంటుంది. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ఏ స్థాయికి వెళ్లాయి? ఏ కార‌ణంతో వీళ్లు విడిపోవాల్సివ‌చ్చింది? మ‌ళ్లీ ఎలా క‌లుసుకున్నారు? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

ఈమ‌ధ్యే విడుద‌లైన రాజ్ త‌రుణ్ సినిమా `ఇద్ద‌రి లోకం ఒక‌టే` క్లైమాక్స్ – `అమృత రామ‌మ్‌` క్లైమాక్స్ రెండూ ఒక్క‌టే. అయితే ఆ క్లైమాక్స్‌కి దారి తీసిన ప‌రిస్థితులు, దానికి ముందు అల్లుకున్న స‌న్నివేశాలు, సంఘ‌ట‌న‌లు పూర్తిగా వేరు. బ‌హుశా.. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఏదైనా ఓ హాలీవుడ్ సినిమా చూసి స్ఫూర్తి పొంది, దానికి అనుగుణంగా క‌థ‌ని అల్లుకుని ఉంటారు.

‘అమృత రామ‌మ్‌’ క‌థ‌లో కొత్త విష‌యాలేం ఉండ‌వు. ఓ అమ్మాయి ఓ అబ్బాయిని పిచ్చి పిచ్చ‌గా ప్రేమించ‌డం త‌ప్ప‌. రామ్ ని అంత‌గా ఆరాధించ‌డానికి అమృత ద‌గ్గ‌ర ఉన్న బ‌ల‌మైన కార‌ణం ఏదీ క‌నిపించ‌దు. ల‌వ్ ఎఫ్ ఫ‌స్ట్ సైట్‌కి అది పీక్ స్టేజ్ అనుకోవాలంతే. రామ్ – అమృత ద‌గ్గ‌రైన ప‌రిస్థితులు, వాళ్ల మ‌ధ్య న‌డిచే స‌న్నివేశాలు కూడా ఏమంత గొప్ప‌గా ఉండ‌వు. ఏ ప్రేమ‌క‌థకైనా ఆయువు ప‌ట్టు హీరో – హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ. అది అమృత – రామ్ మ‌ధ్య అంత‌గా పండ‌లేదు. దాంతో… వాళ్ల ప్రేమ‌.. ప్రేక్ష‌కుడు ఫీల్ అవ్వ‌లేడు. రామ్‌ని చూసిన‌ప్పుడ‌ల్లా అమృత‌లో ‘కోరిక‌’ క‌నిపిస్తుంటుంది త‌ప్ప‌, ప్రేమ కాదు. బ‌హుశా.. ద‌ర్శ‌కుడు అమృత నుంచి త‌న‌కు కావ‌ల్సిన‌ట్టుగా న‌ట‌న‌ని రాబ‌ట్టుకుని ఉండ‌క‌పోవొచ్చు.

అది ద‌ర్శ‌కుడి లోపం అని స‌రిపెట్టుకోవాలి. మాటి మాటికీ హీరో హీరోయిన్లు గొడ‌వ ప‌డ‌డం, మ‌ళ్లీ క‌లుసుకుపోవ‌డం, మ‌ధ్య‌లో పాట‌లు, ముద్దులు.. ఈగోలూ.. ఇలా సాగిపోతుంది క‌థ‌.

ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ తీసుకోవ‌డం వ‌ల్ల, లొకేష‌న్లు కొత్త‌గా క‌నిపించ‌డం వ‌ల్ల‌, ఇది వ‌ర‌కు తెర‌పై చూడ‌ని న‌టీన‌టులు ఆయా పాత్ర‌లు పోషించ‌డం వ‌ల్ల పాత క‌థ‌కు కాస్తో కూస్తో కొత్త లుక్ వ‌స్తుంది. ఆస్ట్రేలియాలో తెల్ల చొక్కా, తెల్ల పంచె క‌ట్టుకుని, ఫ్యాక్ష‌నిస్టుల త‌ర‌హాలో… కాబూలీవాలాలు తిర‌గ‌డం – కాస్త టూ మ‌చ్‌గా అనిపిస్తుంది.

ఈ సినిమాకి బ‌లం, బ‌లగం ఏదైనా ఉంటే.. అది క్లైమాక్స్‌. సినిమా మ‌రో ప‌ది హేను నిమిషాల్లో ముగుస్తుంద‌న‌గా.. ఈ క‌థ‌లో ద‌ర్శ‌కుడు న‌మ్మిన ఆత్మ‌ని చూపించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అది త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని క‌దిలిస్తుంది. క‌థానాయిక పాత్ర‌పై ఓ గౌర‌వాన్ని, సానుభూతికి క‌లిగిస్తాయి. కాక‌పోతే.. ఆ క్లైమాక్స్ కూడా ఇది వ‌ర‌క‌టి సినిమా (ఇద్ద‌రి లోకం ఒకటే)లో చూసిందే కావ‌డంతో – ఫీల్ త‌గ్గుతుంది. క్లైమాక్స్‌ని న‌మ్ముకుని, దాన్ని ప్రేమించి రాసుకున్న క‌థ ఇది. త‌ప్ప‌కుండా ప‌తాక స‌న్నివేశాల్లో ఓ ఆర్థ్ర‌త క‌నిపిస్తుంది. కానీ.. దానికి లీడ్ గా సాగే క‌థ బ‌ల‌హీన‌మైన‌ది. పాత్ర‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌లో స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. దాంతో.. హీరో హీరోయిన్ల పాత్ర‌ల్లో దేన్నీ ప్రేమించలేం. అందుకే గొప్ప క్లైమాక్స్ కూడా చప్ప‌గా క‌నిపిస్తుంది.

న‌టీన‌టులు

రామ్‌, అమృత ఇద్ద‌రూ కొత్త‌వాళ్లే. యావ‌రేజ్ జంట‌. న‌ట‌న కూడా అంతే. కొద్దో గొప్పో అమృత పాత్రే బెట‌ర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కి ముందు త‌న న‌ట‌న న‌చ్చుతుంది. సినిమా అంతా ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్యే న‌డుస్తుంది. మిగిలిన‌వ‌న్నీ పాసింగ్ పాత్రలే అనుకోవాలి. కీల‌క‌మైన ఓ పాత్ర‌లో నిర్మాత క‌నిపించి, న‌ట‌న‌పై త‌న‌కున్న ముచ్చ‌ట‌ని తీర్చుకున్నాడు.

సాంకేతిక‌త‌

ఆస్ట్రేలియాలో ఈ క‌థ‌ని చెప్పాల‌నుకోవ‌డం మంచిదైంది. కనీసం లొకేష‌న్ల ప‌రంగా కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ, సంగీతం.. కూల్ గా సాగాయి. పాట‌ల‌న్నీ బ్యాక్ గ్రౌండ్ లోనే వినిపిస్తాయి. ద‌ర్శ‌కుడు హృద‌యాన్ని పిండేసే ప్రేమ‌క‌థ‌ని చెప్పాల‌నుకున్నాడు. క్లైమాక్స్‌లో దానికి స్కోప్ ఉంది. కానీ… క‌థ‌ని అక్క‌డి వ‌ర‌కూ తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో భంగ‌ప‌డ్డాడు. అంత‌కు ముందు చెప్పే ప్రేమ‌క‌థ‌లో ఏమాత్రం వైవిధ్యం ఉన్నా అమృత రామ‌మ్‌.. ఓ మంచి ప్రేమ‌క‌థ‌గా మిగిలిపోయేది.

ఫినిషింగ్ ట‌చ్‌: విషాద చ‌రిత‌మ్‌

తెలుగు360 రేటింగ్‌: N/A

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌ణిర‌త్నంతో సూర్య‌

మ‌ణిర‌త్నం - సూర్య‌... సూప‌ర్ కాంబినేష‌న్‌. యువ సినిమాతో వీరిద్ద‌రూ మ్యాజిక్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారు. సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క సార‌థ్యంలో...

ముద్రగడ ని వదలని సోషల్ మీడియా

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తాను తప్పుకుంటున్నాను అంటూ నిన్న రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గత చంద్రబాబు హయాంలో ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసిన...

పవన్ ని పొగిడిన అలీ, అప్పటి మాటలను గుర్తు చేసిన జన సైనికులు

కమెడియన్ ఆలీ కి, పవన్ కళ్యాణ్ కి మధ్య ఒకప్పుడు ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక సందర్భంలో, " ఆలీ లేకుండా నీవు సినిమా తీయలేవా " అని...

“కూల్చివేత” ఆపేందుకు ఎన్జీటీకి రేవంత్..!

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతను అడ్డుకునేందుక టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి... రంగంలోకి దిగారు. ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేశారు. సెక్రటేరియట్ కూల్చివేత వల్ల.. పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుందని...

HOT NEWS

[X] Close
[X] Close