2025లో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. సంక్రాంతికి విడుదలైన ‘డాకూ మహారాజ్’ హిట్టయినా, పెద్దగా లాభాలు రాలేదు. కింగ్ డమ్, మాస్ జాతర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. డబ్బింగ్ సినిమా ‘వార్ 2’ నష్టాల్ని మిగిల్చింది. ఇలా.. యేడాదంతా కుదుపులే.
2026లో మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు మంచి ఆరంభం దొరికింది. సంక్రాంతి సీజన్లో వచ్చిన ‘అనగనగా ఒకరాజు’ నిర్మాత నాగవంశీకి మంచి లాభాల్ని మిగిల్చింది. ఈ సినిమాతో కనీసం అటూ ఇటుగా రూ.25 కోట్లు ఖాతాలో వేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఓ మీడియం రేంజ్ సినిమాకి ఈస్థాయిలో లాభాలు రావడం గొప్ప విషయమే. అందులోనూ సంక్రాంతికి గట్టి పోటీ ఎదురైంది. మినిమం రేట్లతో విడుదల చేసిన సినిమా ఇది. ఇలాంటి ప్రతి కూలమైన పరిస్థితుల్లోనూ లాభాలు ఆర్జించారు.
నాగవంశీకి ముందు నుంచి మీడియం రేంజ్ సినిమాలే భారీ లాభాల్ని తెచ్చిపెట్టాయి. మ్యాడ్, మ్యాడ్ 2, టిట్లు, టిల్లు స్క్వేర్.. ఈ నాలుగు సినిమాలూ ఊహించని లాభాల్ని సాధించాయి. ఇప్పుడు కూడా మీడియం రేంజ్ సినిమానే కాపాడింది. ఈ యేడాది నాగవంశీ నుంచి కనీసం మరో నాలుగైదు సినిమాలైనా రానున్నాయి. ఆ సినిమాలకు ఈ విజయం బూస్టప్ ఇస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు.
