భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ మార్చి నెలలో మునుపెన్నడూ లేని విధంగా కుప్పకూలాయి. పశ్చిమాసియాలో ముదిరిన యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ నెలలో బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 9,339 పాయింట్లు అంటే సుమారు 11.48 శాతం పతనమవ్వగా, నిఫ్టీ 50 కూడా దాదాపు 8% పైగానష్టపోయింది. కేవలం మార్చి చివరి రెండు ట్రేడింగ్ సెషన్లలోనే సెన్సెక్స్ 3,325 పాయింట్లకు పైగా పడిపోవడంతో మదుపరుల సంపద సుమారు రూ. 18.60 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మార్చి 30 నాటికి సెన్సెక్స్ 71,947 వద్ద, నిఫ్టీ 22,331 వద్ద ముగిశాయి. ఇది కోవిడ్ కాలం నాటి పతనాన్ని తలపిస్తూ, ఇటీవలి కాలంలో అత్యంత దారుణమైన నెలవారీ పనితీరుగా రికార్డులకు ఎక్కింది.
దారుణంగా నష్టపోయిన చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ట్రేడర్లు
ఈ నష్టాల సునామీలో బడా ఇన్వెస్టర్ల కంటే చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ట్రేడర్లు దారుణంగా దెబ్బతిన్నారు. భారీ పెట్టుబడులు పెట్టే సంస్థలు నష్టాలను తట్టుకుని మార్కెట్ కోలుకునే వరకు వేచి చూసే సత్తువ కలిగి ఉంటాయి. కానీ, తక్కువ మూలధనంతో మార్కెట్లోకి వచ్చే మధ్యతరగతి ఇన్వెస్టర్లు మాత్రం తమ కష్టార్జితం కరిగిపోతుంటే నిస్సహాయంగా ఉండిపోయారు. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా మార్కెట్ బుల్లిష్‌గా ఉండటంతో, స్టాక్ ట్రేడింగ్‌ను ఒక సులభమైన ఆదాయ మార్గంగా భావించి దిగిన సామాన్యులు ఇప్పుడు కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు.
యాప్‌లతో వ్యసనంగా మారిన ట్రేడింగ్
పెరుగుతున్న టెక్నాలజీ, యాప్‌ల పుణ్యమా అని ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చాలా మందికి ఒక వ్యసనం లా మారింది. ఎటువంటి అవగాహన లేకుండా, కేవలం సోషల్ మీడియా చిట్కాలను నమ్మి ఆప్షన్ ట్రేడింగ్ లోకి దిగిన వేలాది మంది యువతకు ఈ మార్చి నెల ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. మార్కెట్ ఎప్పుడూ లాభాలనే ఇవ్వదు, అది అత్యంత ప్రమాదకరమైన జూదంలా కూడా మారుతుంది అనే కఠినమైన వాస్తవాన్ని ఈ పతనం గుర్తుచేసింది. అప్పులు తెచ్చి మరీ ట్రేడింగ్ చేసిన వారు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మార్చిలో.. మరచిపోలేని పాఠం
ఈ మార్చి పతనం ఇన్వెస్టర్లకు ఒక మరచిపోలేని ఆర్థిక పాఠం. స్టాక్ మార్కెట్ అంటే కేవలం బటన్ నొక్కితే వచ్చే లాభం కాదు, అది ప్రపంచ పరిణామాలతో ముడిపడి ఉండే అత్యంత సున్నితమైన వేదిక అని రుజువైంది. చిన్న ఇన్వెస్టర్లు ఇప్పటికైనా జాగ్రత్త పడాలని, ట్రేడింగ్‌ను వ్యసనంగా కాకుండా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడిగా చూడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాలనే చూసి మార్కెట్లోకి వచ్చే వారికి ఈ నెలవారీ నష్టాలు ఒక హెచ్చరిక గంటగా నిలిచాయి.
