రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసేది ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరికించడానికని.. విప్ జారీ చేసి వారందర్ని మరోసారి టార్గెట్ చేస్తుందని ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఈ అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓ ఎమ్మెల్యే బహిరంగంగా విప్ ధిక్కరించినా.. తన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు చెల్లుతుంది కానీ.. అనర్హతా వేటు పడదు.
సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజ్యసభ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన అంశం ఓపెన్ బ్యాలెట్ విధానం. 2003లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణల ప్రకారం, రాజ్యసభ ఓటింగ్ సీక్రెట్ కాదు. ప్రతి ఎమ్మెల్యే తన పార్టీ కేటాయించిన ఏజెంట్‌కు తను ఎవరికి ఓటు వేస్తున్నారో చూపించాల్సి ఉంటుంది. ఇక్కడే ఒక చిక్కుముడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఒక ఎమ్మెల్యే తన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా లేదా ఓటు చూపించినా, ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. పార్టీ సూచనను ఉల్లంఘించినందుకు సదరు ఎమ్మెల్యేపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు తప్ప, అది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు నేరుగా దారితీయదు.
విప్ జారీకి చట్టపరమైన చిక్కులు
సాధారణంగా శాసనసభలో బిల్లుల ఆమోదం లేదా విశ్వాస తీర్మానాల సమయంలో ఇచ్చే విప్ రాజ్యసభ ఎన్నికలకు వర్తించదని ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టం చేసింది. రాజ్యసభ ఓటింగ్‌లో పార్టీ ఆదేశాలను ధిక్కరించినంత మాత్రాన ఒక సభ్యుడిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. కాబట్టి కేవలం విప్ జారీ చేసి ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయొచ్చని భావించడం చట్టపరంగా బలహీనమైన వాదన. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటు వేసినా.. వారు తమ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం తక్షణమే ఉండదు.
నైతిక పరమైన ఒత్తిడికి రాజకీయ వ్యూహం
బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దించడం వెనుక చట్టపరమైన అనర్హత కంటే రాజకీయ నైతిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఓటు వేసేటప్పుడు తమ పార్టీ ఏజెంట్‌కు బ్యాలెట్ పేపర్ చూపించాల్సి ఉంటుంది కాబట్టి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సి వస్తుంది. ఇది ప్రజల్లో వారిని ఎక్స్ పోజ్ చేయడానికి, రాజకీయంగా ఇరకాటంలో పెట్టడానికి ఒక అస్త్రంగా మారుతుంది. కానీ ఇది వారిని పదవుల నుంచి తొలగించడానికి పనికివచ్చే బలమైన చట్టపరమైన అస్త్రం మాత్రం కాదు. సంఖ్యాబలం లేనప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం అనేది కేవలం ఉనికిని చాటుకోవడానికో లేదా ప్రత్యర్థి క్యాంపులో కలవరం సృష్టించడానికో ఉపయోగపడుతుంది. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయడమే ఏకైక లక్ష్యంగా ఈ ఎన్నికలను వాడుకోవాలని చూస్తే, అది రాజకీయంగా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
